లింగంపేట, జూలై 28: చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వాగులో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా, సాయంత్రం స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నారు. ముగ్గురు వరద ఉధృతికి పది గంటలు వాగులోనే ఉండడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఈ సంఘటన మండలంలోని రాంపల్లి స్కూల్ తండాలో గురువారం చోటుచేసుకుంది. ఇందు కు సంబంధించిన వివరాలు.. రాం పల్లి స్కూల్ తండాకు చెందిన దేవసో త్ చాందీరాం, దేవసోత్ బాలు, దేవసోత్ ధూప్యా గురువారం ఉదయం ఏడున్నర గంటల ప్రాం తంలో సమీపంలోని పెద్ద వాగులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఉదయం 9 నుంచి పది గంటల వరకు కురిసిన భారీ వర్షానికి పెద్ద వాగులోకి వరద రావడంతో ముగ్గురు సమీపంలోని చెట్టు పైకి ఎక్కారు.
వరద ఉధృతి ఎక్కువ కావడంతో వారు 100 నంబర్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాసులు, లింగంపేట ఎస్సై శంకర్‌తో పాటు పోలీసులు శెట్పల్లి గ్రామం మీదుగా పెద్ద వాగు వద్దకు చేరుకున్నారు. ఎల్లారెడ్డి ఫైర్ సిబ్బందితోపాటు తాడ్వాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట పోలీసులు వచ్చారు. చెట్టుపై ఉన్న ముగ్గురికి పోలీసులు పెద్ద తాడుతోపాటు లైఫ్ జాకెట్లను అందించారు. తాడు సాయంతో వారు ఒడ్డుకు చేరడానికి ప్రయత్నించగా వరద ఉధృతికి వెనక్కి తగ్గారు. సాయంత్రం ఐదు గంటల తరువాత వరద ఉధృతి తగ్గుతుండగా అదే తండాకు చెందిన దేవసోత్ మోహన్ అనే యువకుడు ధైర్యంతో వాగులోకి దిగి బాధితులను ఒడ్డుకు చేర్చాడు. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
తక్షణమే స్పందించిన మంత్రి వేముల
వరద ఉధృతిలో గిరిజనులు చిక్కుకున్న సంఘటనపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆరా తీశారు. ఎల్లారెడ్డి సీఐ శ్రీనివాస్‌తో వీడియో కాల్ మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్‌తో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సాయం కావాల్సినా వెనుకడుగు వేయరాదన్నారు. దీంతో కలెక్టర్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మంత్రి వేముల అప్పటికప్పుడు సీఎస్ సోమేశ్ కుమార్‌తో మాట్లాడి రాజధాని నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపించే ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వరద ఉధృతి తగ్గు ముఖం పట్టడంతో హెలికాప్టర్ అవసరంలేదని అధికారులు సమాచారం అందించారు. నాలుగు గంటల అనంతరం బాధితులు ఒడ్డుకు చేరిన విషయాన్ని తిరిగి మంత్రికి వివరించారు. సకాలంలో స్పందించిన పోలీసులను మంత్రి వేముల అభినందించారు. ముగ్గురు గిరిజనులు దాదాపు పది గంటల పాటు వాగులోనే ఉండడంతో వారి కుటుంబ సభ్యులు, తండావాసులు ఆందోళనకు గురయ్యారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ జితేశ్ వీ పాటిల్
జిల్లాప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. పెద్ద వాగులో గిరిజనులు చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వరద నీటిలో చిక్కుకోవడం ఇది రెండోసంఘటన అని తెలిపారు. సంఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, రెవెన్యూ, ఫైర్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. సంఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్ ఎస్సైలు ఆంజనేయులు, శంకర్, గణేశ్ పరిశీలించారు.