ఆర్మూర్, జూలై 28 : తెలివితేటలు ఏ ఒక్కరికే సొంతం కాదని, ప్రతిభావంతులుగా మారేందుకు ప్రతి ఒక్కరికీ అర్హత, అవకాశాలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో చిట్ల ప్రమీల జీవన్రాజ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం ‘విద్యా స్ఫూర్తి’ కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతి వార్షిక పరీక్షలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, డీఈవో దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ..తెలివితేటలు కొందరికే సొంతమని ప్రస్తుత సమాజంలో నెలకొన్న దురభిప్రాయం దూరం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ తరహా దృక్పథంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థుల మనస్సులో ఆత్మన్యూనత భావం నెలకొని అనేక మంది తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జన్మతః వచ్చే లక్షణాలు, మనం పెరిగే వాతావరణం ఆలోచనా తీరుపైనే మేధస్సు ఆధారపడి ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైందని చెప్పారు.అందుకే పిల్లల్లో చిన్నతనం నుంచే సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శాయశక్తులా కృషి చేయాలని సూచించారు.పసి వయస్సులో ఉండే పిల్లలు మైనం ముద్దలాంటివారని, వారిని ఏ రకంగా మల్చాలన్నది తల్లిదండ్రులు, గురువులపైనే ఆధారపడి ఉంటుందన్నారు.
ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారని తెలిపారు. దీనికనుగుణంగా మల్చుకుని బోధనా నైపుణ్యాలను పెంపొందించుకుంటే సర్కారు బడులకు మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రుల నమ్మకం వమ్ము కాకుండా చూడాల్సిన గురుతర బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదన్నారు. ఆగస్టులో విద్యార్థుల కెరీర్, పోటీ పరీక్షల్లో విజయానికి దోహదపడే విధంగా హ్యాండ్ రైటింగ్ తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఉపాధ్యాయులకు నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు కూడా ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చనడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నిదర్శనమని పేర్కొన్నారు. నిజానికి ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారిలోనే ఎక్కువ కసి, పట్టుదల ఉంటుందని, సమస్యలను అధిగమించే నేర్పు అలవడుతుందన్నారు.
ఈ సం దర్భంగా ఎస్సెస్సీలో టాపర్లుగా నిలిచిన ఆర్మూర్ జడ్పీ బాలుర పాఠశాలకు చెందిన శ్రీనాథ్, కె. వరుణ్, బాలికల పాఠశాలకు చెందిన అక్షర, అశ్విత, రాంమందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన సృజన, తులసి, చందన, సైదాబాద్ ఉర్దూ మీ డియం జడ్పీహెచ్ఎస్కు చెందిన హమీదాబీ, నదియా బేగమ్ను అవార్డులతో సత్కరించి ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంఈవో పింజ రాజా గంగారాం పాల్గొన్నారు.