బాన్సువాడ రూరల్, జూలై21: “ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడినీ, తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ.. ఎముకల్ మసి చేసి పొలం దున్ని బోషనములన్ నవాబునకు స్వర్ణము నింపినది రైతులదే… తెలంగాణ రైతులదే” అని నవాబును సూటిగా గద్దిస్తూ రచనలు చేసిన మహా కవి దాశరథి. నిజాం నిరంకుశ పాలనపై ఎదురెడ్డి పోరాడిన మహనీయుడు.. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారలుగా మలిచి నిజాం పాలనపై తన కవితలను ఎక్కుపెట్టిన మహాకవి.
నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం తన పదునైన పద్యాలను ఆయుధంగా మలిచి ప్రజల్లో ప్రేరణ కలిగించిన ఉద్యమ కవి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి ఎలుగెత్తిన చాటిన ఘనుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈయన అందరికీ దాశరథిగా సుపరిచితుడు. నూతనంగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో జన్మించిన దాశరథి, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి 1974లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోట (ఇందూరు ఖిల్లా)లో మూడు నెలల పాటు ఖైదీగా జైలు శిక్షను అనుభవించాడు. జైలు నుంచే రచనలు చేస్తూ తెలంగాణాలో నిజాం సర్కారుపై పోరాడేందుకు ప్రజలను ఏకతాటిపై తెచ్చిన తెలంగాణ ముద్దు బిడ్ద దాశరథి కృష్ణమాచార్యుడి 97వ జయంతి నేడు.
దాశరథి ప్రస్థానం
దాశరథి కృష్ణమాచార్యులు 1925 జులై 22న ఉమ్మడి వరంగల్ జిల్లా చిన్న గూడూరులో జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం మహాబూబాబాద్ జిల్లాలో ఉంది. ఈయన బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యూలేషన్, భోపాల్ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియెట్ చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసిన దాశరథి ఉర్దూ, ఆంగ్లం, సంసృ్కతం భాషల్లో మంచి పండితుడు. చిన్నతనం నుంచే పద్యాలు రచించడంతో ప్రావీణ్యం సంపాదించాడు. మొదట కమ్యూనిస్టు పార్టీలో ఉండి రెండో ప్రపంచయుద్ధం సమయంలో పార్టీ వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాడు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 1987 నవంబర్ 5న మరణించారు.
నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం
దాశరథి ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణిలో ప్రయోక్తగా విధులు నిర్వహించారు. నిజాంపాలనలో తెలంగాణ ప్రాంతం రకరకాల హింసలకు గురవుతున్న తీరును చూసి ఆయన చలించిపోయారు. పీడిత ప్రజల గొంతుగా ఉద్యమబాట పట్టారు. నిజాంను వ్యతిరేకిస్తూ ఆయన చేసిన రచనలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయి. తెలంగాణలో హింసకు గురవుతున్న ప్రజల పక్షాన నిలిచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. రచనలు, పద్యాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. నిజాంపాలనకు వ్యతిరేకంగా పోరాడుతుండడతో నిజాం సర్కారు దాశరథి కృష్ణమాచార్యులను 1947లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందూరు కోట (ఖిల్లా)లో ఖైదీగా బంధించింది.
నిజాంపాలనపై వ్యతిరేకిస్తున్న దాశరథితోపాటు మరో 150 మంది కోటలో ఖైదీలుగా శిక్ష అనుభవించారు. శిక్ష కాలంలో నిజాం పాలకులు పళ్లు తోముకోవడానికి బొగ్గులు ఇస్తే, బొగ్గు ముక్కను పాలకులపై వజ్రాయుధంగా ప్రయోగించి కవీంద్రుడై వెలిశారు. బొగ్గుతో జైలు గోడలపై నిజాం వ్యతిరేకంగా పద్యాలు రాసి జైలు అధికారులతో దెబ్బలు తిన్నారు. ఇందూరు ఖిల్లాలో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే అగ్నిధార ఖండకావ్యం పురుడుపోసుకున్నది. ఇక్కడి నుంచే ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే నినాదం ఉద్భవించింది. మంచి వాక్చాత్యురం కలిగి ఉండడంతో ఊరూరా తిరుగుతూ భావప్రేరేపిత ప్రసంగాలతో సాంస్కృతిక చైతన్యం ప్రజల్లో రగిలించారు.
ప్రఖ్యాతిగాంచిన దాశరథి గ్రంథాలు
దాశరథి కృష్ణమాచార్యులు అనేక కవితా సంపుటాలు రచించారు. దాశరథి అనేక సినిమాలకు గీతాలు రాశారు. ఆయన రాసిన పాటలు ప్రజల్లో విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. దాశరథి రచనల్లో పేరెన్నిక గల రచనలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి రుద్రవీణ, అగ్నిధార, మహోంధ్రోదయం, మార్పు నా తీర్పు, ధ్వజమెత్తిన ప్రజ, ఆలోచనాలోచనాలు తదితర రచనలు ఆయన కలం నుంచి జాలువారాయి.