వానకాలంలో ప్రబలే వ్యాధుల నుంచి గొడ్డూగోద, పాడి పంటలను రక్షించాలని వేడుకుంటూ గ్రామదేవతలకు కల్లుసాక పోసి, యాటలను బలిస్తూ మొక్కులు చెల్లించుకునేందుకు ఇందూరులో సర్వం సిద్ధమైంది.నిజామాబాద్ నగర వాసులు ఊర పండుగను ఈ నెల 17న (ఆదివారం) సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించుకోనున్నారు. సర్వసమాజ్, పండుగ నిర్వహణ కమిటీల ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లను చేస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ తరహాలో ఇందూరులో ఊర పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
-ఇందూరు, జూలై 16
తొట్లెల తయారీ..
తొట్లెలను ఒకరోజు ముందు రాత్రి అనగా శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 3గంటల వరకు హమాలీ, చాటకార్మిక సంఘం ఆధ్వర్యంలో కొత్తగంజ్‌లో తయారు చేసి ఉదయం 5గంటల వరకు శారదాంబగద్దె (తేలుమైసమ్మ గద్దె) వద్ద ఉంచుతారు. ఊరేగింపులో మొదట తొట్లెలు ఊరేగుతాయి. కొండెంగ హన్మాండ్ల వద్ద వడ్లధాతీలు తయారు చేసే పెద్ద తొట్లె దేవతా విగ్రహాలతో పాటు సిర్నాపల్లి గడికి చేరుకుని అక్కడి నుంచి మహాలక్ష్మమ్మ గుడికి చేరుతుంది. ఊరపండగలో కీలకమైన బోనాలు శనివారం రాత్రి సిర్నాపల్లి గడిలో నుంచి ఐదు కడవలతో బయల్దేరుతాయి. అందులో ఒకటి నల్లపోచమ్మ మందిరం (దేవీమాత మందిరం), ఒకటి ఎల్లమ్మగుట్టలోని పెద్ద పోచమ్మ గుడికి, కంకాళమ్మ గుడికి మరొకటి, కోటగడ్డ మైసమ్మ గుడికి ఒకటి, అడెల్లి మైసమ్మ గుడికి ఒకటి వెళ్తుంది.
గ్రామదేవతలను శక్తి స్వరూపిణులుగా.. మహిమ గల మహాలక్ష్మమ్మ కాపాడమ్మ, అడెల్లి పోచమ్మ ఆదరించమ్మ, సార్గమ్మ.. ఎలాంటి రోగాలు రాకుండా చూడమ్మ అంటూ భక్తిశ్రద్ధలతో వేడుకోనున్నారు. పాడిపంటలు, గొడ్డు, గోదా బాగుండాలని, పాడి పంటలు కాపాడాలని, వర్షాలు సకాలంలో కురియాలని కోరుతూ ఏటా ఆషాఢ మాసంలో జరిపే ఊరపండుగకు ఇందూరు నగరం ముస్తాబైంది. నేడు నగరంలో భారీఎత్తున ఊరపండుగను సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. పెద్ద పండుగ సందర్భంగా ఉదయం నగరంలోని ఖిల్లా ప్రాంతం నుంచి దేవతా విగ్రహాలను ఊరేగించనున్నారు. ఊర పండుగ విశేష పదార్థంగా ‘సరి’ని నగరంలోని నలు మూలలా చల్లుతూ చెరువుల్లో కలపనున్నారు.
విగ్రహాల ఊరేగింపు..
కర్రతో ప్రత్యేకంగా అమ్మవార్ల విగ్రహాలను తయారు చేయించి ఊరేగింపు నిర్వహిస్తారు. ఖిల్లా రఘునాథ ఆలయం వద్ద ఉన్న శారదాంబ గద్దె (తేలు మైసమ్మ)ను పసుపు, కుంకుమ, చెవి పొగులు, గాజులు తదితర ఆభరణాలతో నగర పెద్దలు అలంకరించి, ప్రత్యేక పూజుల నిర్వహించి వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం దేవతా మూర్తులతో ఊరేగింపుగా బయల్దేరి గాజులపేట్ చౌరస్తా మీదుగా పెద్దబజార్ చౌరస్తా వరకు చేరుకుంటారు. పెద్దబజార్ చౌరస్తా నుంచి రెండు బృందాలుగా విడిపోయి డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య ఒక బృందం పౌడలమ్మ, నల్ల పోచమ్మ, అడెల్లి పోచమ్మ, పులిరాజులు, రాట్నం, తొట్లెలతో దుబ్బ వైపు ఊరేగింపుగా వెళ్తుంది. రెండో బృందం సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌లోని చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాలరకు చేరుకుంటుంది. ఈ రెండు బృందాలతోపాటు సరి (ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదం)ని గుల్లల్లో నాలుగు భాగాలుగా విభజిస్తారు. ఈ ‘సరి’ని ఒకటి దుబ్బ వైపు, రెండోది వినాయక్‌నగర్ వైపు మూడోది ఎల్లమ్మగుట్ట, నాల్గవది కంఠేశ్వర్ వైపు చల్లుతూ వెళ్తారు.
నేడు ఊర పండుగ
ఇందూరు, జూలై 16 : జిల్లాకేంద్రంలో నేడు (ఆదివారం) ఊరపండుగను నిర్వహించనున్న ట్లు ఊర పండుగ కమిటీ కన్వీనర్ రామర్తి గంగాధర్, కార్యదర్శి బంటు గంగాధర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వసమాజ్ ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో కోటగల్లీలో దేవతామూర్తులను చేయించామని పేర్కొన్నారు. పండుగ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
అమ్మవార్ల తయారీలో వతన్‌దార్లు
ఊరపండుగకు మూడు రోజుల ముందు బండారు వేసిన రోజు నుంచి గ్రామ దేవతలను అశోక్వీధిలోని వడ్లధాతి వద్ద వతన్‌దార్లు మామిడి దుంగలతో అమ్మవార్ల విగ్రహాలను తయారు చేయడం ప్రారంభిస్తారు. గ్రామ దేవతలైన సార్గమ్మ(2), బోగంసాని కొండల్రాయుడు రాట్నం, ఆసు, బండి, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ, పౌడలమ్మ, పెద్దమ్మ, అడెల్లి పోచమ్మ, అంపుడు పోచమ్మ ప్రతిమలను తయారు చేసి ఘనంగా ఊరేగిస్తారు.
తేలు మైసమ్మ గద్దె నుంచి విగ్రహాల ఊరేగింపు..
సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆల యం వద్దనున్న శారదాంబ గద్దె (తేలు మైసమ్మ) వద్ద గ్రామ దేవతలను పసుపు, కుంకుమ, చెవిపోగులు ఆభరణాలతో విశేషంగా అలంకరించి పూజ లు చేస్తారు. తరువాత అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. ఖిల్లా నుంచి గాజుల్పేట్ చౌరస్తా, పెద్దబజార్ చౌరస్తా మీదుగా పలు ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను దర్శించుకుంటూ గ్రామ దేవతలను ఊరేగిస్తారు. ఈ సందర్భంగా మహిళలు పూనకాలతో, తొట్టెల కింద నుంచి దూరి వెళ్లేందుకు బారులు తీరుతారు. నగరంలో దేవతల ఉరేగింపు కొనసాగే చౌరస్తాలలో ప్రజలు మేకలు, గొర్రెలను, కోళ్లను ఎదురిచ్చి బలిస్తూ కల్లు సాకలు పోస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి వీధిలోని మూడు తొవ్వల వద్ద జీవాలను బలిస్తారు. ఈ పండుగ రోజు పొలిమేర దాటివెళ్లవద్దని, అలా వెళ్తే అరిష్టమని భావిస్తారు. దీనిని నగర ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తూ ఆచరిస్తారు.