రెంజల్, జూలై 16 : పంటలు నష్టపోయిన రైతులకు సహా యం అందించి ఆదుకోవాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎంపీపీ రజిని అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. వానకాలంలో వ్యాధులు ప్రబలకుం డా నీటి ట్యాంకులను ప్రతిరోజూ శుభ్రం చేయాలని, నీటిని వడబోసి తాగాలని, ఆరోగ్య సూత్రాలు పాటించాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈలు చంద్రకాంత్శర్మ, గబ్బర్‌సింగ్ సభలో ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.
అంగన్వాడీ టీచర్లు విధులపై సరైనా రీతిలో స్పందించక పోతే వారికి మెమోలు జారీ చేయాలని సూపర్వైజర్ ప్రమీలారాణికి ఎంపీడీవో శంకర్ సూచించారు. నీలా గ్రామ పశువైద్య సహాయకులు అందుబాటులో ఉండడంలేదని వైస్ ఎంపీపీ యోగేశ్ మండల వైద్యాధికారి విఠల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టీసీ అధికారులు కింది స్థాయి సిబ్బందిని పంపడంతో బస్సుల సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదని వీరన్నగుట్ట ఎంపీటీసీ గంగాలత సభలో సమస్యను లేవనెత్తారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మేక విజయ, తహసీల్దార్ రాంచందర్, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
సర్పంచ్‌కు సన్మానం
సంసాద్ ఆదర్శ గ్రామ్ యోజన కింద 2016-17 సంవత్సరంలో అప్పటి ఎంపీ కవిత కందకుర్తిని దత్తత తీసుకొని అభివృద్ధి చేయించారు. అభివృద్ధిలో కందకుర్తి గ్రామం దేశంలోనే 19వ స్థానంలో నిలువగా కేంద్ర ప్రభుత్వం అవార్డును అందజేసింది. ఈ మేరకు సర్పంచ్ ఖలీంబేగ్, కార్యదర్శి నవీన్, పారిశుద్ధ్య కార్మికులను ఎంపీడీవో కార్యాలయం తరఫున ఘనంగా సన్మానించారు. అలాగే మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎంపీపీ రజిని, వైస్ ఎంపీపీ యోగేశ్, మిగతా ఎంపీటీసీలను సన్మానించారు. రెంజల్ ఆదర్శ కళాశాలలో అంబేద్కర్‌నగర్‌కు చెందిన విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో 466/470 మార్కులతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిన ఐశ్యర్య కాంబ్లేను అభినందిస్తూ మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు శాలువా తో సత్కరించి ఘనంగా సన్మానించారు.