వేల్పూర్, జూలై 16: జిల్లాలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. మండలంలోని పచ్చలనడ్కుడ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పినట్లు జిల్లాలో 30 చెక్‌డ్యాములు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు జీవో కాపీ చూపిస్తే జానకంపేట్ చెక్‌డ్యామ్ వద్ద తాము ముక్కు నేలకు రాస్తామన్నారు. జీవో కాపీ చూపించకపోతే ముక్కు నేలకు రాస్తావా అని అర్వింద్‌ను సవాల్ చేశారు. అర్వింద్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతారని, ఆయన బతుకే అబద్ధాల మయమని విమర్శించారు.
అర్వింద్ చెప్పే మాటలను జిల్లాలో నమ్మేవారు ఎవరూ లేరన్నారు. ఇప్పటికైనా అర్వింద్ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. జాన్కంపేట్ చెక్‌డ్యామ్ మంత్రి బంధువు కట్టలేదని, భారీ వర్షాలు, కలిగోట్, కొలిప్యాక్, పడకల్ చెరువులు తెగిపోవడంతో వందేండ్లలో ఊహించని వరద వచ్చి చెక్‌డ్యామ్ పక్కనున్న మట్టి కట్ట మాత్రమే కొట్టుకుపోయిందని తెలిపారు. మెయిన్ చెక్‌డ్యామ్ దెబ్బ తినలేదన్నారు. వరదలపై రాజకీయాలు మాని దమ్ముంటే కేంద్రం నుంచి రూ.20వేల కోట్ల వరద సహాయం ప్యాకేజీ తీసుకురావాలన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పి మోసం చేశారని ఆరోపించారు.
మడమ తిప్పని నాయకుడు మంత్రి ప్రశాంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి జిల్లాలో వందలు, వేల కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారని తెలిపారు. నాలుగేండ్లలో ఎంపీ అర్వింద్ ఒక్క రూపాయి పని చేయలేదన్నారు. మంత్రి కాలిగోటికి కూడా సరిపోవన్నారు. అబద్ధాలు చెప్పుకుంటూ గ్రామాల్లోకి వస్తే ప్రజలే తరిమి కొడుతారన్నారు. సమావేశంలో ఆర్డీఏ సభ్యుడు రేగుల్ల రాములు, ఉప సర్పంచ్ ఏనుగు గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నల్ల రమేశ్, భీమ ప్రసాద్, సొసైటీ మాజీ చైర్మన్ రాజన్న, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బైరి రవి, ఎంపీటీసీలు జంగారెడ్డి భూమన్న పాల్గొన్నారు.