కమ్మర్పల్లి/ వేల్పూర్, మార్చి 16 : సెర్ప్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలను అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సెర్ప్ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్‌లో బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జేఏసీ రాష్ట్ర నాయకులు కుంట గంగారెడ్డి, నర్సయ్య, సుభాష్‌గౌడ్, రాజారెడ్డి, మధుగౌడ్ తదితరులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి మొక్కను బహూకరించి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో మంత్రి వేముల ఎంతో కృషిచేశారని కొనియాడారు.
మంత్రిని కలిసిన వేల్పూర్ ఫీల్డ్అసిస్టెంట్లు..
తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించడంపై ఫీల్డ్ అసిస్టెంట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు హైదరాబాద్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.