నిజామాబాద్, జూలై 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి):నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ఆదివారం కూడా తడిసి ముద్దయ్యాయి. వరుసగా నాలుగో రోజూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. నిజామాబాద్ జిల్లాలో సగటు కన్నా 120 శాతం అధికంగా వానలు కురిశాయి. మోర్తాడ్, నవీపేటలో అత్యధికంగా 19.05 సెం.మీ, ఆర్మూర్ -మచ్చర్లలో 17.8సెం.మీ, మాక్లూర్ -మదనపల్లిలో 17.6సెం.మీ, ఆర్మూర్- మగ్గిడిలో 16.9సెం.మీ, రెంజల్లో 16.5సెం.మీ, ఆర్మూర్ -ఇసాపల్లిలో 16.02 సెం.మీ, జక్రాన్‌పల్లిలో 15.9 సెం.మీ, ముప్కాల్-వేంపల్లి, బాల్కొండలో 15.35 సెం.మీ, ఆలూర్‌లో 15.2సెం.మీ. చొప్పున వాన కురిసింది. బాల్కొండ, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ భారీ వర్షాలు కురిశాయి. సిరికొండ – తూంపల్లి, చీమన్‌పల్లి, ధర్పల్లిలో కనిష్ఠంగా 7.8 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోనూ 133 శాతం మేర అధికంగా వానలు కురిశాయి. నస్రుల్లాబాద్, బొమ్మన్‌దేవ్‌పల్లిలో 13.2 సెం.మీ, సర్వాపూర్‌లో 12.5సెం.మీ, గాంధారిలో 11.03సెం.మీ, కామారెడ్డి పాత రాజంపేటలో 10.43 సెం.మీ, నిజాంసాగర్లోని మగ్దుంపూర్‌లో 9.4సెం.మీ, బీర్కూర్‌లో 8.9 సెం.మీ, బాన్సువాడ-కొల్లూర్‌లో 8.75 సెం.మీ, బీబీపేట, దోమకొండ, నిజాంసాగర్‌లో 8.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మద్నూర్ – డోంగ్లిలో 4సెం.మీ, సదాశివనగర్‌లో 3.83 సెం.మీటర్లుగా నమోదైంది.
చెరువులకు జలకళ..
భారీ వర్షాలకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. నిజామాబాద్ ఇరిగేషన్ సీఈ పరిధిలో 968 చెరువులు ఉండగా, ఇందులో 519 చెరువులు మత్తడి దుంకుతున్నట్లుగా అధికారులు వెల్లడించారు. 369 చెరువులు 75-100 శాతం నీటితో నిండుగా ఉన్నాయి. 80 చెరువుల్లో 50-75 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి. మరికొద్ది గంటలపాటు వాన కురిస్తే అలుగులు పారుతున్న చెరువుల పరిస్థితి ఆందోళనగా మారే అవకాశాలున్నాయి. కామారెడ్డి ఇరిగేషన్ పరిధి(కొంత భాగం నిజామాబాద్ కలుస్తుంది)లో 2,168 చెరువులున్నాయి. ఇందులో అత్యధికంగా ఎల్లారెడ్డి డివిజన్లో 309, బాన్సువాడ డివిజన్లో 149, నిజాంసాగర్ డివిజన్లో 39, కామారెడ్డి డివిజన్లో 34 ఉన్నాయి. వీటిలో 531 చెరువులు అలుగు పోస్తున్నాయి. 138 చెరువుల్లో 0-25శాతం మేర నీరుంది. 395 చెరువుల్లో 25-50 శాతం, 473 చెరువుల్లో 50-75శాతం, 631 తటాకాల్లో 75-100 శాతం నీటి నిల్వలు ఉన్నాయి.
కుప్పకూలిన నివాసాలు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలో మట్టితో నిర్మించిన పాత పెంకుటిండ్లు చాలా చోట్ల కూలిపోయాయి. కొన్ని పాక్షికంగా, మరికొన్ని పూర్తి స్థాయిలో కూలడంతో ఆస్తి నష్టం జరిగింది. ఎక్కడా ప్రాణ నష్టం వాటిల్లలేదు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 21, ఆర్మూర్‌లో 30, బోధన్‌లో 17 ఇండ్లు వర్షాల ధాటికి ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ నగరంలో రెండు ఆవులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో షాక్‌తో మృత్యువాత పడ్డాయి. పలు చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ఇరిగేషన్ అధికారులు సకాలంలో స్పందించక పోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఇంజినీర్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ పెట్టుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక అధికారులు
రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితులను పరిశీలిచేందుకు ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. ఉమ్మడి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి క్రిస్టి నా జడ్ చోంగ్తూను నియమించారు. ప్రజలకు సహాయ సహకారాలను అందించేందుకు యంత్రాంగం అందుబాటులో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరపాలక సంస్థ, బోధన్, భీమ్‌గల్, ఆర్మూర్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల్లో భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులను పరిశీలించేందుకు మున్సిపల్ శాఖ తమ రీజినల్ డైరెక్టర్లను ఇన్‌చార్జీలుగా నియమించింది. ఉమ్మడి జిల్లాకు షాహిద్ మసూద్ సమన్వయం చేయనున్నారు.