ఖలీల్‌వాడి, జూలై 8: ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తిరుమలకు 1,016 ఆర్టీసీ బస్సులను నడుపనున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా విడుతల వారీగా 1200 ఉద్యోగాలను భర్తీచేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో తిరుమలకు ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బాజిరెడ్డి మాట్లాడారు. వేంకటేశ్వరస్వామి దయ, సీఎం కేసీఆర్ సహకారంతో ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు.
సంస్థ నష్టాల నుంచి బయటికి వస్తోందన్నారు. సిబ్బందికి చెల్లించాల్సిన బకాయిలను త్వరలోనే అందిస్తామన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. తిరుపతి వెంకన్న దర్శనం కోసం ప్రతిరోజు వెయ్యి మందికి రూ.300 ప్రత్యేక శీఘ్ర దర్శన టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. ఇతర వివరాలకు ఆర్టీసీ వెబ్సైట్ www.tsrtconline.in లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చని, కనీసం ఏడు రోజుల ముందుగానే టికెట్‌ను బుక్ చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీకి ప్రతిరోజూ రూ.15 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు ఆదాయం వస్తోందని తెలిపారు. కార్గో సర్వీసుల ద్వారా వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. అనంతరం ప్రధాన బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అత్యవసర పరిస్థితిలో బస్సులో మహిళలు డెలివరీ అయితే ఆ శిశువుకు జీవితకాలం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా ప్రజలు సిటీ బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నగర మేయర్ నీతూకిరణ్, జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్టీసీ ఈడీ జీహెచ్‌జడ్ యాదిగిరి, ఈడీవో మునిశేఖర్, ఈడీ కేజడ్ వెంకటేశ్వర్లు, ఆర్ఎం మహబూబ్‌నగర్ శ్రీధర్, డీఎం కృష్ణారెడ్డి, ఆర్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.