నవీపేట, జూలై 2 : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని లింగం గుట్ట సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ కళాశాల అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందింది. గ్రామీణ పేద విద్యార్థులకు వరంగా మారింది. కళాశాలలో విద్యను అభ్యసించిన మూడు బ్యాచ్‌ల విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కళాశాలలో ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. లెక్చరర్లకు సైతం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మండల కేంద్రంలో 2014 లో ప్రారంభమైన పాలిటెక్నిక్ కళాశాలలో ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లు పూర్తయ్యాయి.
గ్రామీణ విద్యార్థులకు వరం..
నవీపేట మండల కేంద్రంలోఅధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కళాశాల గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు వరంగా మారింది.మండలంలోని వివిధ గ్రామాలకు చెంది న వారే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాలకు చెంది న విద్యార్థులు కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నా రు. అన్ని సౌకర్యాలతో కూడిన ల్యాబ్‌లు,అవసరమైన ఫ్యాక్టల్టీ ఉండడంతో నాణ్యమైన విద్యకు బాటలు పడుతున్నాయి.
సాంకేతిక విద్యతో ఉపాధి అవకాశాలు మెండు..
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక విద్యకు మంచి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలను దక్కించుకొని జీవితంలో స్థిరపడుతున్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ బదులు నేరుగా పాలిటెక్నిక్ మూడేండ్ల కోర్సు పూర్తి చేసిన అనంతరం ఈ-సెట్ ప్రవేశ పరీక్ష రాసి బీటెక్‌లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో చేరి మూడేండ్లలో బీటెక్ పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఇంజినీర్లుగా స్థిరపడుతున్నారు.
ఒక్కో కోర్సులో 60 సీట్లు..
నిజామాబాద్ జిల్లాలో నవీపేట, నందిపేట, కోటగిరి, నిజామాబాద్‌లో ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నిజామాబాద్ (బాలుర) కళాశాలలో సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కోటగిరిలో మెకానికల్, ఈఈఈ, నందిపేట్‌లో ఈసీఈ, మెకానికల్, నిజామాబాద్ (బాలికల)కళాశాలలో సివిల్, ఈసీఈ, నవీపేట్ కళాశాలలో సివిల్, మెకానికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉన్నాయి.
మెండుగా ఉపాధి అవకాశాలు
పాలిటెక్నిక్ విద్యను అభ్యసించిన విద్యార్థులకు జీవితంలో త్వరితగతిన స్థిర పడేందుకు ఉపాధి ఆవకాశాలు మెండుగా ఉన్నాయి. మా కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థిరపడ్డారు. అనతి కాలంలోనే నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాలకు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు వచ్చింది.
-గంగాధర్‌రావు, ప్రిన్సిపాల్, పాలిటెక్నిక్ కళాశాల నవీపేట్.
విద్యార్థులను ఉత్తమంగా తీర్చి దిద్దుతున్నాం
మా కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉన్నతమైన ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించి ఉత్తమంగా తీర్చి దిద్దుతున్నాం. ప్రతి రోజూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నాం. జిల్లాలోనే నవీపేట్ కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చేందుకు అంకితభావంతో పని చేస్తున్నాం.
-రూప్సింగ్, ఫ్యాకల్టీ, పాలిటెక్నిక్ కళాశాల, నవీపేట్
క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది
నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాలలో నేను సివిల్ ఇంజినీర్ ఫైనల్ ఈయర్ చదువుతున్నాను. ఇటీవల హైదరాబాద్ ఆల్ఫా ఇండస్ట్రియల్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగానికి ఎంపికయ్యాను. కళాశాలకు చెందిన ఫ్యాకల్టీస్ నాణ్యమైన విద్యను బోధించడంతోనే పెద్ద పారిశ్రామిక సంస్థలో ఉద్యోగానికి ఎంపికయ్యాను.
-లోహిత్, మెకానికల్ విద్యార్థి, పాలిటెక్నిక్ కళాశాల నవీపేట..
సైంటిస్టుగా స్థిర పడతాను.
నేను నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఫైనల్ ఈయర్ చదువుతున్నాను. కష్టపడి భవిష్యత్తులో ఇస్రోలో సైంటిస్టు(శాస్త్రవేత్తగా) ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయడమే నా ప్రథమ లక్ష్యం. ఆ దిశగా ప్రతి నిత్యం కష్టపడుతున్నాను. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడి తల్లితండ్రులతో పాటు విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకువస్తాను.
-శ్రీధర్, సివిల్ ఫైనల్ ఈయర్, పాలిటెక్నిక్ కళాశాల నవీపేట్