సదాశివనగర్, జూన్ 28: ఉపాధి హామీ పథకం పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించే విషయంలో ఎంపీడీవోలు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హెచ్చరించారు. మండల కేంద్రంలో అభివృద్ధి పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. సదాశివనగర్, రామారెడ్డి గ్రామాల మధ్య రోడ్డు వెంట ఏర్పాటు చేస్తున్న అవెన్యూ ప్లాంటేషన్ వద్ద ఉపాధి కూలీలలో మాట్లాడారు. తాము చేసిన పనులకు ఇంతవరకు డబ్బులు రాలేదని కూలీలు కలెక్టర్‌కు విన్నవించారు. వెంటనే ఆయన ఎంపీడీవో లక్ష్మి, ఈజీఎస్ అధికారులతో మాట్లాడారు. పోస్టాఫీసులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సోమవారం డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డబ్బులు వెంటనే చెల్లిస్తే వారికి పంట పెట్టుబడి కోసం ఉపయోగపడుతాయని అన్నారు. అనంతరం పల్లె ప్రకృతివనం, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, అవెన్యూ ప్లాంటేషన్, గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. అభివృద్ధి పనుల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ గైని అనసూయా రమేశ్, ఎంపీడీవో లక్ష్మి, తహసీల్దార్ వెంకట్ రావు, ఎంపీవో సురేందర్‌రెడ్డి, ఏపీఎంలు తిరుపతి నాయక్, రాజిరెడ్డి, ఏవో ప్రజాపతి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పెసరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రగతితో సుందరంగా పల్లెలు..
పల్లెప్రగతితో గ్రామాలు సుందరంగా మారాయని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, అవెన్యూప్లాంటేషన్, మహాప్రస్థానం, క్రీడాప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెప్రగతితో గ్రామాల్లో అభివృద్ధితోపాటు ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నట్లు పేర్కొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో విజయవంతమైనట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ శారద, జడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, ప్రత్యేకాధికారిణి భాగ్యలక్ష్మి, ఎంపీడీవో చిన్నారెడ్డి, తహసీల్దార్ శాంత, ఈఈ లక్ష్మీనారాయణ, ఎంపీవో తిరుపతిరెడ్డి, సర్పంచ్ అంజలి, ఏపీవో రజిని, ఏఈ మీనా, ఏవో పవన్‌కుమార్, ఏపీఎం రాజు, ఈవో సౌజన్య తదితరులు పాల్గొన్నారు.