నిజామాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో మరింత మందికి ‘ఆసరా’ లభించనున్నది. ఇప్పటికే ప్రతి నెలా వృద్ధులతో పాటు వితంతువు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బోదకాలు బాధితులు, చేనేత, గీత, బీడీ కార్మికులకు సైతం పింఛన్లు అందుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే పింఛన్ మొత్తాన్ని సీఎం కేసీఆర్ డబుల్ చేశారు. మరింత మందికి ఆసరా కల్పించేందుకు అర్హత వయస్సును 57 సంవత్సరాలకు కుదించారు. ఈ నిబంధనను త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అర్హత వయస్సును తగ్గించడంతో అర్హుల జాబితా మరింత పెరుగనున్నది. ప్రభుత్వంపైన ఆర్థిక భారం పెరుగుతున్నప్పటికీ ప్రజా ప్రయోజ నార్థం కేసీఆర్ సర్కారు ముందడుగు వేయబోతున్నది. గ్రామాల వారీగా అధికారులు తీసిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 40వేల మంది, కామారెడ్డి జిల్లాలో దాదాపు 25వేల మంది కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది. త్వరలోనే వీరందరికీ పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో దరఖాస్తుదారుల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.
2018, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కోటి అమలు చేస్తున్న ది. బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే పింఛన్‌ను డబుల్ చేసిన సీఎం కేసీఆర్ తాజాగా అర్హత వయస్సును 57 సంవత్సరాలకు కుదించి అర్హులైన వారికి పింఛన్లు అందివ్వబోతున్నా రు. ఈ నిబంధనను త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చేందుకు తగు చర్య లు తీసుకుంటున్నారు. ఇప్పటికే లక్షలాది మంది అభాగ్యులకు పింఛ న్ డబ్బులు ఠంచనుగా పంపిణీ అవుతున్నాయి. ఎనిమిదేం డ్లుగా నిరాటంకంగా అమలవుతున్న పింఛన్లతో పేద కు టుంబాల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది.
పెరిగిన పింఛన్ డబ్బులను మూడేండ్లుగా రూ.1000 నుంచి రూ.2016కు, ఇక దివ్యాంగులకు సైతం రూ.1500 నుంచి రూ.3016 చొప్పున అందిస్తున్నారు. వారంతా సంతోషం వెలిబుచ్చుతున్నారు. మొత్తంగా పింఛన్‌ను డబుల్ చేయ గా…అర్హత వయస్సును భారీగా తగ్గించడంతో ఈసారి అర్హుల జాబితా మరింతగా పెరిగే ఆస్కారం ఏర్పడింది. 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు పింఛన్ అర్హత వయస్సును తగ్గించడంతో ప్రభుత్వ సాయం పొందే వారి సంఖ్య మరింతగా పెరుగనున్నది. ప్రభుత్వంపైనా భారం పెరుగుతున్నప్పటికీ ప్రజా ప్రయోజనార్థం కేసీఆర్ సర్కారు ముందడుగు వేయబోతున్నది.
భారీగా దరఖాస్తులు…
సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో పింఛన్ అర్హత వయస్సును భారీగా తగ్గించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సైతం ప్రకటించింది. ఇటు పింఛన్ల పెంపుతో పాటు అర్హత వయస్సును 65 నుంచి 57 ఏండ్లకు కుదించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో చాలా మందికి మరింత ప్రయోజనం చేకూరనున్నది. ఓటరు జాబితాను అనుసరించి గ్రామాల వారీగా తీసిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 40వేల మంది, కామారెడ్డి జిల్లాలో దాదాపు 25వేల మందికి కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది. వీరంతా 57 ఏండ్లు పూర్తి చేసుకున్న వారే కావడంతో వీరికి రూ.2016 పింఛన్‌కు అర్హులుగానే గుర్తించబోతున్నారు. ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేస్తే నాటి నుంచి కొత్తగా పింఛన్ పంపిణీ ప్రక్రియ షురూ అవుతుంది. పల్లె ప్రగతి 5వ విడుత కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యటనలు చేసిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పలు చోట్ల నూతన పింఛన్లపై ప్రకటన చేశారు. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పడంతో సంబంధిత వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతున్నది.
ప్రతి ఇంట్లో పింఛన్ లబ్ధిదారు…
సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో వృద్ధాప్య పింఛన్లు దక్కాలంటే అదో ప్రహసనంగా ఉండేది. దరఖాస్తు చేసుకున్న లక్షలాది మందిలో కొద్ది మందికి మాత్రమే బొటాబొటిన ఇచ్చే రూ.200 పింఛన్ చేతికి దక్కేది. అది కూడా దళారులు, మధ్యవర్తులకు కమీషన్లు ఇచ్చుకోగా నడవ చేతకాని వృద్ధులకు చేరేది గగనమే అయ్యేది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పింఛన్ల పంపిణీని మానవతా దృక్పథంతో చేపట్టారు. దళారులను నిలువరించడంతో పాటు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు. అర్హత ఉన్న వారందరికీ తొలి విడుత ప్రభుత్వంలో రూ.1000 పింఛన్ అందించారు. ఆ తర్వాత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రభుత్వంలో రూ.2016 అందిస్తున్నారు. ప్రతి నెలా వృద్ధులకు పింఛన్ పంపిణీతో పాటు భరోసా కోల్పోయిన ఆయా వర్గాలకు సైతం పింఛన్ సౌకర్యం కల్పించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బోదకాలు బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు సైతం పింఛన్లు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలోనూ ఏదోల రకంగా పించన్ అందుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. దివ్యాంగులకు తొలుత రూ.1500 పించన్ అమలు చేయగా ప్రస్తుతం రూ.3016 అందుతోంది.
ఆశావాహుల్లో ఆనందం…
57ఏండ్లు పూర్తి చేసుకుని పింఛన్‌కు అర్హత కలిగిన వారిలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. త్వరలోనే వీరందరికీ పించన్లు అమలు చేయనుండడంతో వారంతా సంబురం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 57 ఏండ్ల వయస్సు నిండిన వారికి పింఛన్ అమలు చేయబోతుండడాన్ని ఆయా వర్గాలు స్వాగతిస్తున్నాయి. పింఛన్ అర్హత వయస్సు కుదింపుతో ఉభయ జిల్లాలో వేలాది మందికి లబ్ధి చేకూరబోతోంది. ప్రస్తుతం రెండు జిల్లాలో 4లక్షల 5వేల 789 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతున్నాయి. వీరికి ప్రతి నెలా తెలంగాణ ప్రభుత్వం వెచ్చిస్తోన్న మొత్తం రూ.85.54 కోట్లుగా ఉంది. కొత్తగా పించన్లు మంజూరైతే ప్రభుత్వం నెలవారీగా వెచ్చిస్తోన్న మొత్తం వ్యయం భారీగానే పెరుగనున్నది.