శక్కర్‌నగర్, జూన్ 16: రెండేండ్లుగా చోరీలకు పాల్పడుతూ, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న ఓ నిందితుడిని బోధన్ పోలీసులు గురువారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బోధన్ ఏసీపీ రామారావు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
బోధన్‌లోని బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారు జామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా.. అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతడు ఈనెల 8వ తేదీన గంజ్రోడ్డులోని ఓ తాళం వేసిన ఇంట్లో, లక్ష్మీనగర్‌లో మరో ఇంట్లో చోరీ, మే నెలలో వేంకటేశ్వర కాలనీలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. మార్చిలో శక్కర్‌నగర్‌లోని మరో తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ చోరీ సంఘటనల్లో సుమారు రూ. 7లక్షల విలువైన బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల రికవరీ చేశారు.
నిందితుడు బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్లాల్ గ్రామ ఇందిరమ్మ కాలనీలో నివసించే షేక్ షాదుల్లాగా గుర్తించారు. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవించే షాదుల్లా జల్సాలకు డబ్బు సరిపోక చోరీలకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందని ఏసీపీ వివరించారు. విలేకరుల సమావేశంలో బోధన్ పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై దరివేముల పీటర్, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిని పట్టుకోవడంతో ప్రతిభ చూపిన ఎస్సై మశ్చేందర్‌రెడ్డి, పీసీ షేక్ కైసర్తో పాటు విచారణలో సహకరించిన పీసీలు శ్రీకాంత్, రవి, రాజేశ్, శంకర్‌ను ఏసీపీ అభినందించి వారికి నగదు పారితోషికాలను అందజేశారు.
సోషల్ మీడియాలో పోస్టింగ్‌లను నమ్మొద్దు..
సోషల్ మీడియాల్లో వచ్చే పోస్టింగ్‌లను ప్రజలు నమ్మొద్దని, ఎక్కడో జరిగే, ఫేక్ పోస్టింగ్‌లతో ప్రజలు కొన్నిమార్లు రోడ్లపైకి వస్తున్నారని ఇది సరైంది కాదని ఏసీపీ రామారావు అన్నారు. ఎవరికైనా తప్పుడు, మనోభావాలు దెబ్బతీసే విధంగా పోస్టులు వస్తే పోలీసులను ఆశ్రయించాలని, సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాలను అతిక్రమించి రోడ్లపై ర్యాలీలు, నిరసనలు చేయొద్దన్నారు. అనవసరంగా పోలీసుకేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని, యువత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ సూచించారు.