రెంజల్, జూన్ 14: మండలంలోని కందకుర్తి సమీపంలో గోదావరి, హరిద్ర, మంజీర నదులు కలిసే త్రివేణి సంగమ క్షేత్రం ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంగళవారం భక్తులతో కిలకిటలాడింది. ఏరువాక పౌర్ణమి రోజు త్రివేణి సంగమంలో కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరిస్తే నిండు నూరేళ్లు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
సీతారాంధాం సంత్ ఆశ్రమంలో అన్నదానం..
గోదావరి నదీ తీరాన 2018లో దాతల విరాళాలతో నిర్మించిన శనీశ్వర ఆలయ నాలుగో వార్షికోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు సీతారాం త్యాగి మహరాజ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి భక్తులకు మహా అన్నదానం ఏర్పాటుచేశారు.
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఇందూరు/ రుద్రూర్/కోటగిరి, జూన్ 14: ఏరువాక పున్నమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గోల్‌హన్మాన్ ఆలయం లో స్వామివారికి అర్చనలు, ప్రత్యేక హారతి నిర్వహించినట్లు చైర్మన్ నీలగిరి రాజు తెలిపారు. స్వామివారిని నగర మేయర్ నీతూకిరణ్ దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వేణు, ధర్మకర్తలు, అర్చకులు ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు. నగరంలోని కలెక్టరేట్లో ఉన్న శ్రీనవదుర్గ మాతా ఆలయంలో ఉద్యోగులు పూజలు చేశారు. వినాయక్‌నగర్‌లోని భూలక్ష్మీ మాత ఆలయంలో ఘనాపాటి మధుసూదన్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, చండీహోమం నిర్వహించినట్లు అధ్యక్షుడు ఆకుల సుజాతాశ్రీశైలం తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తోట గోపాల్, పొద్దుటూరు గంగారెడ్డి, ఆంజనేయులు, ప్రభాకర్, ఆలయ పురోహితులు పాల్గొన్నారు. రుద్రూర్ మండలంలోని గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు.