ఖలీల్‌వాడి, జూన్ 8 : క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేసేందుకే సీఎం కేసీఆర్ పట్టణప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరంలోని 19వ డివిజన్ పరిధిలో ఉన్న న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం 38వ డివిజన్ పరిధిలోని సంజీవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను స్థానిక కార్పొరేటర్ దృష్టికి తీసుకువస్తే సంబంధిత శాఖల అధికారుల ద్వారా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏఐసీటీఈ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ గ్రాంట్స్ రూ.2 కోట్లతో నిర్మించనున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతిగృహం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో నగర మేయర్ నీతూకిరణ్, కార్పొరేషన్ కమిషనర్ చిత్రామిశ్రా, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.