బాన్సువాడ రూరల్/ ఇందూరు, జూన్ 7: రోహిణి కార్తెలో ఎండలతో అల్లాడిపోయిన సర్వకోటి జీవులకు మృగశిర కార్తె ప్రవేశంతో ఉపశమనం కలుగుతుంది. కార్తె మొదటిరోజును దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మిరుగు, మిర్గం పేర్లతో వ్యవహరిస్తారు. వర్షారంభానికి సూచనగా భావించే ఈ కార్తెలోనే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జింక తలను పోలి ఉండడంతో ఈ కార్తెను మృగశిర కార్తెగా నామకరణం చేశారని పండితులు పేర్కొన్నారు. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రారంభమవుతుంది. రోహిణి నక్షత్రంలో భానుడి ప్రతాపంతో రోళ్లు పలిగితే, మృగశిరలో రుతుపవనాల రాకను సూచిస్తుంది. రుతుపవనాల రాకతో కురిసే తొలకరి జల్లులతో పుడమి పులకరించిపోతుంది. ఏరువాక సాగే కాలం ఆరంభమవుతుం ది. కురిసె తొలకరి వర్షాలతో రైతులు దుక్కిలు దున్ని వానకాలం పంటల సాగుకు సిద్ధమవుతారు. రైతుల ముఖాల్లో చిరునవ్వులు నింపే కార్తిగా మృగశిర కార్తెను భావిస్తారు. మిరుగం రోజున చేపలు తినడం, మామిడి పండ్ల పానకం తయారు చేసి సేవించడం ఆనవాయితీ. ఉమ్మడి జిల్లాలో నేడు మిరుగం పండుగను ప్రజలు జరుపుకోనున్నారు.
రుతుపవనాల ఆగమనం..
మృగశిర కార్తె ప్రారంభమైందంటే వాతావరణంలో అనే క మార్పులు చోటు చేసుకుంటాయి. రోహిణి కార్తె వరకు ఎండలు మండి ప్రజలు అల్లాడిపోగా మృగశిర కార్తె రాకతో వాతావరణం చల్లబడుతుంది. తొలకరి వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులు జోరందుకుంటాయి. గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై దుక్కిలు దున్ని, పంట సాగులో మునిగి తేలుతుంటారు. వ్యవసాయానికి ఈ కార్తె ఎంతో ముఖ్యమైనదిగా రైతులు భావిస్తుంటారు. మృగశిర కార్తెలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తే సాగు చేసిన పంటలకు తెగుళ్లు, చీడపీడల బారిన పడకుండా అధిక దిగుబడి వస్తుందని అన్నదాత అపార నమ్మకం.
వాతావరణంలో అనేక మార్పులు..
మృగశిర కార్తె ఆరంభం కాగానే వాతావరణంలో అనేక మార్పులు వస్తాయి. ఆకాశం మబ్బులతో కూడుకొని గాలిలో తేమశాతం పెరగడంతో అస్తమా ఎక్కువ అవుతుంది. ఇందుకోసం మృగశిర రోజున ప్రత్యేకంగా అస్త మా కలిగిన వారికి ఇంగువతో కలిపిన చేప ప్రసాదం ప్రతి సంవత్సరం పంపిణీ చేసేవారు. గ్రామీణ ప్రాంతాల్లో మిరుగం రోజున చేపలు తింటే ఏ రోగాలు రావని ప్రజల నమ్మకం. ప్రతి ఇంట్లో చేపల కూరను వండుకుంటారు. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఆదొండ కాయను వంట కూరల్లో వండుకోవడానికి ఆసక్తి చూపుతారు. మిరగం రోజున చేపలకు మంచి డిమాండ్ ఉంటుంది. మత్స్యకారులు మంగళవారమే జిల్లా కేంద్రాలతోపాటు మండలాల్లో చేపల విక్రయ కేం ద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపల పెంపకం కోసం మత్స్యకారులకు రాయితీ, చేపల పెం పకం కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక, మరమ్మతులు చేపట్టడంతో నీటి సామర్థ్యం పెరిగి, ప్రతి గ్రామంలో చేప పిల్లల ఉత్పత్తి పెరిగింది. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామాల్లోనే చేపలు పుష్కలంగా లభించనున్నాయి.
మిరుగం రోజు తప్పకుండా చేపలు తింటాం
మేము ప్రతి సంవత్సరం మిరు గం రోజున చేపలు తింటాం. ఈ కార్తె రోజున చేపలు తినడంతో శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ధరలు పెరిగినా కూడా త ప్పకుండా చేపలు తింటాం. చేప లు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, శరీరానికి ఎంతో మేలు.
-భాస్కర్, కొనుగోలుదారుడు
గిరాకీ బాగుంది
మిరుగు ముందు రోజు నుంచే గిరాకీ బాగుంటుంది. అందరూ ఒకేసారి కొనుగోలు చేయడంతో డిమాండ్‌కు తగ్గట్లు కొంత సప్లయ్ తగ్గడంతో ధరలు పెరుగుతాయి. చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది. రెండేండ్లుగా కరోనా కారణంగా గిరాకీ అంతమాత్రంగా ఉండగా ఈసారి బాగుంది.
– రాంచందర్, చేపల వ్యాపారి