భక్తుల జయజయధ్వానాలతో సీహెచ్ కొండూరులోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రం మార్మోగుతున్నది. ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా మూడోరోజైన సోమవారం క్షీరాధివాసం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత- అనిల్‌కుమార్, దేవనపల్లి నవలత-రాంకిషన్‌రావు దంపతులు, కుటుంబసభ్యులు 4400 లీటర్ల గోక్షీరంతో ప్రతిష్ఠాపన విగ్రహాలకు అభిషేకం చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు ఒకవైపు.. భక్తుల జయజయ ధ్వానాలు మరోవైపు.. వెరసి కొండూరు గ్రామం ఆధ్యాత్మిక భావనతో పరవశించి పోతున్నది. ప్రతిష్ఠాపనోత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నందిపేట్, జూన్ 6 : భక్తజనం పులకించేలా గోవింద నామస్మరణ మార్మోగుతున్నది. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ నృసింహాస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు అందరినీ ఆధ్యాత్మికమయం చేస్తున్నాయి. జయజయ నృసింహ.. నమో నారసింహ మంత్రం ప్రతిధ్వనించింది. మూడో రోజు సోమవారం కొనసాగిన వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబీకులు 4400 లీటర్ల ఆవు పాలతో ప్రతిష్ఠాపన విగ్రహాలకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్ గ్రామంలోని శ్రీరాజ్యలక్ష్మీ సమేత నృసింహాస్వామి క్షేత్రంలో మూడో రోజు ఉదయం ప్రాతఃకాల ఆరాధన వేదవిన్నపాలతో మొదలైన కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రవాహంలో భక్తులను ముంచెత్తుతున్నాయి. జలాధివాసంలో ఉంచిన ప్రతిష్ఠాపన మూర్తులను క్షీరాధివాసం చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్ర నియమాల ప్రకారం 4400లీటర్ల గోక్షీరాన్ని ఉపయోగించి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది భక్తులు భక్తిప్రపత్తులతో సమర్పించిన ఆవు పాలను సైతం క్షీరాధివాసంలో మమేకం చేశారు.
జలాధివాసంతో ప్రతిష్ఠాపన విగ్రహాల్లో శేష మాలిన్యాలు తొలగిపోయి జలంలోని మంత్రశక్తితో మూర్తులు దివ్యత్వాన్ని పొందాయని, ఈ క్షీరాధివాసం ప్రతిష్ఠాపనమూర్తులు ఇతర పరివార దేవతలకు ప్రాణప్రతిష్ట సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేసేందుకు నిర్వహించినట్లు వేదపండితులు చెప్పారు. క్షీరాధివాసంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డీఆర్.అనిల్‌కుమార్ దంపతులు, నవలత రామ్‌కిషన్‌రావు దంపతులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల్లో నివేదన, మంగళ శాసనం, శాత్తుమోరె, ద్వారా తోరణం, ధ్వజ కుంభారాధన, చతుస్థానార్చన, అగ్నిముఖం, మంత్రహవనం, మృత్తికా విన్నపం, నయన ఉన్మీలనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనం, మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్టితో ఆలయం పరవశించింది. వేలాదిగా భక్తులు హాజరై ప్రతిష్ఠాపన ఉత్సవాలను తిలకించారు.
ఉత్సవాల్లో పాల్గొన్న ప్రముఖులు..
శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాల్లో సోమవారం పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పూజలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ బిగాల మహేశ్, నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి దంపతులు, శాసనమండలి సభ్యులు రఘోత్తమ్రావు, పూల రవీందర్, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, టీఆర్ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.