మెండోరా, జూన్ 6 : రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మెండోరా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొప్పెల సాయిరెడ్డి, ఆయన అనుచరులు 20 మంది మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరడం శుభ పరిణామమని అన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో వందల కోట్లతో జరిగిన అభివృద్ధి అందరికీ కండ్ల ముందు కనిపిస్తున్నదన్నారు. రూ.100 కోట్లతో చెక్‌డ్యామ్‌లు నిర్మించి ఏండ్ల తరబడి ఉన్న సాగునీటి గోసను తీర్చుకున్నామన్నారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా కాకతీయ వరద కాలువలు మండు వేసవిలో కూడా నిండుకుండల్లా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రతి పల్లెనూ అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నామని దానికి ప్రజలే సాక్ష్యమన్నారు. హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మెండోరా సర్పంచ్ మచ్చర్ల రాజారెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నవీన్‌గౌడ్, మండల ఉపాధ్యక్షుడు బడాల గంగారెడ్డి, సొసైటీ చైర్మన్ మచ్చర్ల రాజారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.