బోధన్, మే 6: పట్టణంలోని శక్కర్‌నగర్ ప్రజలకు వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాను మంజూరుచేయించామని, ఈ దవాఖాను తాత్కాలికంగా స్థానిక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసి, అనంతరం శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన పట్టణంలోని శక్కర్‌నగర్‌లో పలు వార్డుల్లో పర్యటించారు. బస్తీ దవాఖాన, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శక్కర్‌నగర్‌లో ఒకప్పటి నిజాం షుగర్స్ జనరల్ దవాఖాన భవనం ఆవరణలో బస్తీ దవాఖాన భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. అప్పటివరకు రామాలయం సమీపంలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసే బస్తీ దవాఖాన సేవలను స్థానికులు ఉపయోగించుకోవాలని సూచించారు.
గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ భవన్ పేరిట ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను శక్కర్గనగర్ కాలనీలో, ఎస్టీ కమ్యూనిటీ హాల్‌ను నర్సాపూర్ రోడ్డులో నిర్మిస్తామని చెప్పారు. శక్కర్‌నగర్‌లో మైనార్టీల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికను ఏర్పాటుచేయాలన్న స్థానిక కౌన్సిలర్ల విజ్ఞప్తికి స్పందించిన ఎమ్మెల్యే.. అందుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, నిజాం షుగర్స్ కోర్ కమిటీ మెంబర్ విశ్వనాథం, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కొత్తపల్లి రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రామలింగం, మున్సిపల్ డీఈ శివానందం, కౌన్సిలర్లు దూప్‌సింగ్, రాషేద్, ఇంతియాజ్, మీర్ నజీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి నాగేపూర్ ఉప సర్పంచ్
నవీపేట, జూన్6: నాగేపూర్ ఉప సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సోమవారం బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ సమక్షంలో టీఆర్ఎస్ మండల యువజన అధ్యక్షుడు డాన్ సాయికుమార్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. బోధన్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎమ్మెల్యే గులాబీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ పథకాలకు ఆకర్శితుడినై పార్టీలో చేరినట్లు తెలిపారు. త్వరలో గ్రామంలో అన్ని వర్గాల యువకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీలో చేర్చేంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మండల అభివృద్ధిపై పార్టీ నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో పార్టీ మండల సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, నీరడి బుచ్చన్న, మల్లెపూల గంగాధర్, శ్యామ్, అజ్జు జలేందర్, మోహన్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.