బోధన్/ఆర్మూర్/భీమ్‌గల్, జూన్ 5: పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల వారీగా గుర్తిస్తున్న సమస్యలు జాప్యం లేకుండా పరిష్కరించాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణంలోని 29, 17 వార్డులను ఆయన మున్సిపల్ కమిషనర్ రామలింగం, డీఈఈ లింగంపల్లి శివానందంతో కలిసి ఆదివారం పరిశీలించారు. వార్డుల్లో వేసిన సీసీ రోడ్ల పక్కన మొక్కలను నాటాలని సూచించారు. కందకం స్థలంలో వేసిన షెడ్డును తొలగించి అక్కడ పార్కును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జి. రామలింగం, అధికారులతో కలిసి పర్యటించారు. ఏఈలు సూర్య శ్రీనివాస్, దుర్గం శివకృష్ణ, కౌన్సిలర్లు తూము శరత్‌రెడ్డి, కె.శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో చేపడుతున్న పట్టణ ప్రగతి పనులను కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ పరిశీలించారు. మురికి కాలువలను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్‌ను చల్లించారు. వార్డు ప్రత్యేకాధికారులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మండలంలోని ఆలూర్ గ్రామంలో రైతులకు 150 కిలోల వర్మి కంపోస్టు ఎరువును సర్పంచ్ కల్లెం మోహన్‌రెడ్డి విక్రయించారు.
భీమ్‌గల్‌లోని 6వ వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కౌన్సిలర్ సీహెచ్ గంగాధర్ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్తపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.