నిజామాబాద్, జూన్ 3, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):పల్లె, పట్టణాల అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే ఉద్దేశంతో చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాల్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో ఐదో విడుత పల్లె ప్రగతి, పట్టణాల్లో నాల్గో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు శుక్రవారం ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రుద్రూర్ మండలం బొప్పాపూర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ‘ప్రగతి’ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని వారు తెలిపారు. పట్టణ ప్రగతితో పరిశుభ్రత, పచ్చదనంతో పట్టణాలు కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
గ్రామసీమలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతూ.. అభివృద్ధే ధ్యేయంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు గ్రామాల్లోని వార్డుల్లో, పట్టణాల్లోని డివిజన్లు, కాలనీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి చేపట్టాల్సిన పనులను గుర్తించారు. అనంతరం గ్రామసభ నిర్వహించి నివేదికలోని అంశాలు, భవిష్యత్ కార్యాచరణ, పల్లె, పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనులపై సలహాలు, సూచనలు తీసుకున్నారు. నిజామాబాద్ నగరం ఎన్జీవోస్ కాలనీలో రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పట్టణ ప్రగతిని, రుద్రూర్ మండలం బొప్పాపూర్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, బిచ్కుంద మండలం హస్గుల్‌లో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి మండలాల్లో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సదాశివనగర్‌లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి, జూన్ 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి, వివిధ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పడకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల క్షేమం కోరి వారి అవసరాలకు తగ్గట్టుగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే సంతోషించాల్సింది పోయి.. పనికిరాని పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ మీద దుమ్మెత్తి పోయడం ఎంత వరకు సమంజసమన్నారు.
రాష్ర్టాలకు ఏమీ చేయని కేంద్ర ప్రభుత్వం కోట్లల్లో అప్పులు చేస్తే తప్పు లేదు కానీ, ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే తప్పేముందన్నారు. యువత బీజేపీ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. పనిచేసే వారికే గౌరవం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎంపీపీ విమలారాజు, జడ్పీటీసీ తనూజరెడ్డి, మాజీ ఎంపీపీ డికొండ హరిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, పడకల్ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ రుత్వీక్, తహసీల్దార్ మల్లేశ్, ఎంపీడీవో లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రతకే పట్టణ ప్రగతి
విద్యానగర్,జూన్ 3: పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో శుక్రవారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ఉన్న దేవునిపల్లి 12, 35వ వార్డుల్లో వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాన్ని గంపగోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు ప్రారంభించామన్నారు. కాలనీల్లో మార్పు వచ్చినప్పుడే మున్సిపాలిటీ బాగుంటుందని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఇంటింటికీ తడి,పొడి చెత్త డబ్బాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు.
ప్రభుత్వ సంకల్పానికి తోడుగా మనవంతు బాధ్యతతో కృషి చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజలంతా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రజలు తమ ఇంటినే కాకుండా పరిసరాలను పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి,వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, రాష్ట్ర నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, కౌన్సిలర్లు గోదావరి,క్రిష్ణాజీరావు, వనిత, నాయకులు కాసర్ల స్వామి, లింగారావు తదితరులు పాల్గొన్నారు.