ఖలీల్వాడి/ఇందూరు, మే 27 : ఈనెల 31 నుంచి ప్రారంభం కానున్న ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈనెల 31 నుంచి జూన్ 18వ తేదీ వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు కొనసాగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. నిజామాబాద్, ఆర్మూ ర్, బోధన్ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులను నడిపించాలని ఆర్టీసీ ఆర్ఎంకు సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చూడాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. పరీక్షలు సజావుగా కొనసాగేలా ఆయాశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ అరవింద్బా బు, డీఐఈవో రఘురాజ్ తదితరులు పాల్గొన్నారు.
సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు
నిజామాబాద్ క్రైం, మే 27 : ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజు వెల్లడించారు. పరీక్షాకేంద్రాల వద్ద పోలీసుల ప్రత్యేక పికెట్లను సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెంటర్లకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని వెల్లడించారు. పరిసర ప్రాం తాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు. సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులు నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.