ముప్కాల్, మే 17: కూరగాయ పంటల్లో టమాట, వంకాయ, బెండకాయ, మిరప ముఖ్యమైనవి. దోస, గుమ్మడి, కాకర వంటి తీగజాతి పంటలను తక్కువ నీటితో సాగు చేయవచ్చు. వేసవి పంటల్లో నీటిఎద్దడి, పూత, పిందె రాలడం, చీడపీడల బెడద ప్రధాన సమస్యలు.
నీటి ఎద్దడి : కూరగాయల్లో అధిక శాతం నీరే ఉంటుంది. సాగునీటి ఎద్దడి ఏర్పడితే దిగుబడితోపాటు నాణ్యత కూడా గణనీయంగా తగ్గిపోతుంది. పంట తొలిదశతోపాటు పక్వదశలో నీటిఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. ఎక్కువ మోతాదులో పశువుల ఎరువును వాడడంతో భూమిలో తేమ ఆవిరి కాకుండా ఉండటంతోపాటు కలుపు మొక్కలను నివారిస్తుంది. మల్చింగ్ను పంట వ్యర్థాలతో లేదా ప్లాస్టిక్ షిట్తో వేయవచ్చు. పొలం లో మొక్కల మధ్య దూరం ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువగా నీరు ఆవిరవుతుంది. వేసవిసాగులో మొక్కల మధ్య ఎడం తక్కువ ఉండేలా చేసుకోవాలి.
నీటి తడులు:
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నేల స్వభావాన్ని బట్టి నీరందించాలి.
టమాటకు ఐదారు రోజులకు ఒక తడిస్తూ పూత, పిందె దశలో శ్రద్ధ చూపాలి.
వంకాయకు నాలుగైదు రోజులకు ఒకసారి తడివ్వాలి. నీటి ఎద్దడి వస్తే కాయ రంగు, పరిమాణం తగ్గి, కాయల్లో చేదు వస్తుంది.
బెండకు ప్రతి నాలుగు రోజులకు ఒక తడి అవసరం. కాయ పెరుగుదల దశలో జాగ్రత్త వహించాలి. లేదంటే దిగుబడిపై ప్రభావం పడుతుంది.
ఎరువుల యాజమాన్యం:
వేసవిలో ఎరువుల వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అన్ని ఎరువులు లవణ గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవి నీటిని పీల్చుకొని, కరిగి మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. వేసవిసాగులో రసాయనిక ఎరువులను మొక్కల మొదళ్లకు దగ్గరగా వేయకుండా ఐదు సెంటీమీటర్ల ఎడంగా వేసుకోవాలి. నీటిలో కరిగే ఎరువులను ఫెర్టిగుషన్ పద్ధతి ద్వారా ఇస్తే అధిక ప్రయోజనం ఉంటుంది.
పూత, పిందె రాలడం:
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో పూత, పిందె రాలిపోతుంది. దీని నివారణకు నేలలో ఎప్పుడూ తేమ ఉండేలా చూడాలి. టమాట, వంకాయ పంటలకు ఫ్లోనోఫిక్స్ 2.5 మి.లీ పది లీటర్లు నీటిలో కలిపి పూత దశలో వారం వ్యవధిలో రెండుసార్లు మొక్కలపై పిచికారీ చేయాలి.మిరప పూతదశలో ట్రైకాంటినాల్ 200 మి.గ్రా, ఫ్లోనోఫిక్స్ 2.5 మి.లీ పది లీటర్లు నీటిలో కలిపి వారం వ్యవధిలో పిచికారీ చేయడంతో పిందె రాలడం తగ్గుతుంది.తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతకు మగపూలు ఎక్కువగా వచ్చి దిగుబడి తగ్గుతుంది. వీటి నివారణకు నాలుగు ఆకుల దశలోనూ, పూత దశలోను బొరాన్ చేయాలి.
సస్యరక్షణ :
వేసవిలో రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెల్లదోమ, పేనుబంక, పిండి పురుగు, నల్లులు అధిక నష్టాన్ని కలిగిస్తాయి. వీటి నివారణకు పొలం చుట్టూ జొన్న, సజ్జ పైరులను కంచె పంటలుగా పెంచితే రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. పొలంలో అక్కడక్కడ ఎల్లోప్టిక్ ట్రాప్స్ (పసుపు రంగు జిగురు అట్ట)లను పెట్టాలి. వీటికి తెల్లదోమలు ఆకర్షితమై అతుక్కుపోయి చనిపోతాయి.రసంపీల్చే పురుగుల నివారణకు లీటరు నీటిని డైమిథోమేట్, ఫిప్రొనిల్ 2 మి.లీ, ఎసిఫిట్ 1.5 గ్రా, ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి.తీగజాతి కూరగాయల్లో పండు ఈగ నివారణకు మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పండు ఈగ నివారణకు విషపు ఎరలను కూడా వాడుకోవచ్చు.