ఎడపల్లి (శక్కర్‌నగర్), మే 10: ఎడపల్లి మండలంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి, మెప్మా పీడీ రాములు సూచించారు. ఎంపీపీ కార్యాలయంలో మన ఊరు మన బడికి ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. 14 పాఠశాలల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. మండలంలోని అంబం (వై) గ్రామంలో పనులు ప్రారంభించినా నివేదికలు అందలేదని, నివేదికలను ఎప్పటికప్పుడు అధికారులకు అందజేయాలని సూచించారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం వరకు పనులు పూర్తి చేయించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో శంకర్, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంఈవో రామారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడులకు నూతన శోభ..
ఆర్మూర్, మే 10: ‘మన ఊరు మన బడి’తో పాఠశాలలు నూతన శోభ సంతరించుకుంటాయని ఆర్మూర్ బల్దియా చైర్పర్సన్ పండిత్ వినిత అన్నారు. పెర్కిట్, నవనాథపురం ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి పనులను ఆమె మంగళవారం ప్రారంభించారు. నవనాథపురం పాఠశాలలో రూ.21లక్షలు, పెర్కిట్ పాఠశాలలో రూ.25లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్లు జనార్దన్ రాజు, జహీర్ అలీ హస్రద్, లిక్కి శంకర్, ఏంఈవో రాజగంగారాం, హెచ్ఎంలు శేఖర్, విజయలక్ష్మి, మున్సిప ల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, మున్సిపల్ డీఈ భూమేశ్వర్, ఏఈ రఘు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన..
బాల్కొండ, మే 10: బాల్కొండ మండలంలోని బస్సాపూర్ ప్రాథమిక పాఠశాలను ఎంపీడీవో సంతోష్ మంగళవారం సందర్శించారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఎంపీవో వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రటరీ విద్యాసాగర్, ఉపసర్పంచ్ మహేశ్వర్, టీఆర్ఎస్ నాయకుడు కె.గంగయ్య, ఎస్ఎంసీ చైర్మన్ భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.