సదాశివనగర్/దోమకొండ/ భిక్కనూర్, మే 9: జిల్లాలోని సదాశివనగర్ పల్లె ప్రకృతివనం రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలుస్తుందని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్‌బాబు అన్నారు. పల్లెల్లో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు అందంగా ముస్తాబై అందరినీ ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం ఆయన కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్, దోమకొండ, భిక్కనూర్ మండలాల్లో ప్రత్యేక అధికారుల బృందంతో కలిసి పర్యటించారు. పల్లె ప్రకృ తి వనాలు, ప్రభుత్వ పథకాల అమలుతీరును పరిశీలించారు.
సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంలో అధికారులతో కలిసి కలియదిరిగారు. డ్వాక్రా సంఘాల మహిళలతో మాట్లాడారు. అనంతరం ప్రభుత్వ పథకాల అమలుపై వీడి యో చిత్రీకరించారు. ఈ సందర్భంగా సురేశ్ బాబు మాట్లాడుతూ.. పల్లెలన్నీ పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో 32 రకాల మొక్కలతో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి వనంలో వెయ్యి మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంలో మొక్కల పెంపకంపై గ్రామ పంచాయతీ పాలకవర్గం ఎంతో కృషి చేస్తోందని పేర్కొంటూ సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా సురేశ్‌బాబును సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు.
అనంతరం సురేశ్‌బాబు భిక్కనూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పర్యటించారు.పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. దోమకొండ మండల కేం ద్రంలో కోతుల ఆహార శాల, హరితహారం నర్స రీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, వైకుంఠరథం, మరుగు దొడ్లు, డంపింగ్ యార్డ్‌ను పరిశీలించారు. వీటన్నింటినీ చిత్రీకరించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. అధికారుల బృందంలో రాష్ట్ర కో- ఆర్డినేటర్ సుశాంత్ కుమార్, డీపీవో సాయిబాబా, ఎంపీడీవో కలం రాజ్వీర్, ఎంపీవోలు సురేందర్ రెడ్డి, ప్రవీణ్‌కుమార్, ఏపీవో తిరుపతి నాయక్, ఏపీఎం రాజిరెడ్డి, జడ్పీటీసీ తిర్మల్ గౌడ్, సర్పంచులు అంజలి, మంజుల ఉపసర్పంచ్ శ్రీకాంత్, ఎంపీడీవోలు చిన్నారెడ్డి, అనంత్‌రావు, డీఎల్పీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.