నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 9: జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. శివారు ప్రాంతాల్లో చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంపై సీపీ నాగరాజు ప్రత్యక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలతోపాటు ఇతర నేరాలను ‘డ్రోన్ నిఘా’తో పసిగట్టనున్నారు. ప్రధానంగా గ్రామాలు, మండలాలతోపాటు నగర శివారు, అటవీ ప్రాంతాల్లో పేకాట, జూదం, కోళ్ల పందేలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను డ్రోన్ కెమెరాతో గుర్తించనున్నారు. పోలీసులు అక్కడి వరకు వెళ్లకుండా తాము ఉన్న చోటి నుంచే వీటిపై దృష్టి సారించనున్నారు. సీపీ ఆదేశాలమేరకు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ డ్రోన్ కెమెరాను ప్రయోగాత్మకంగా సోమవారం రాత్రి ఆవిష్కరించారు. సౌత్ రూరల్ సీఐ జె.నరేశ్, ఎస్సై లింబాద్రి, సిబ్బందితో కలిసి డ్రోన్ కెమెరా ద్వారా దుబ్బ శివారు ప్రాంతాలను పరిశీలించారు. కెమెరా ద్వారా శివారుతోపాటు మారుమూల ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా జరగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సులువుగా గుర్తించనున్నట్లు ఏసీపీ తెలిపారు.