అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది..పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదన మరిచిపోతుంది.ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌదాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం..కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం.. నేడు ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
బాన్సువాడ రూరల్, మే 7: పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది మానవ జన్మ. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిచ్చేది మాతృమూర్తి. అమ్మ గురించి ఎంత చేప్పినా తక్కువే, ఎంత చేసినా స్వల్పమే.. ఎంత తలచినా మధురమే. ఈ జన్మలో దైవాన్ని చూసే భాగ్యం తల్లికి బిడ్డగా పుట్టడం. బిడ్డ రేపటి భవిష్యత్ కోసం నిరంతరం శ్రమించే నిత్యశ్రామికురాలు అమ్మ. ఇంత గొప్ప విశిష్టత కలిగిన అమ్మను ఆదరించడం ఎదిగిన ప్రతి బిడ్డ కర్తవ్యం.
మాతృత్వం, ప్రేమానుబంధాలకు గుర్తుగా.. తల్లులు బిడ్డ క్షేమానికి ప్రత్యక్ష సేవలను గుర్తించేందుకు జరుపుకొనేదే మాతృ దినోత్సవం. భారతదేశంలో తల్లిని దేవతగా కీర్తిస్తారు. మదర్స్ డేను మొదట అమెరికాలో నిర్వహించారు. ముఖ్యంగా అమెరికా సంయుక్త రాష్ర్టాల్లో యుద్ధంలో తమ పిల్లలను కోల్పోయిన తల్లులు ఒక సంఘంగా ఏర్పడి విడిపోయిన కుటుంబాలను కలపడం కోసం మదర్స్ డేను జరుపుకొన్నారు. 1904లో తల్లులను గౌరవిస్తూ జాతీయ దినాన్ని ఏర్పాటు చేయాలని ప్రాంక్ ఇ హెరింగ్ ఆదేశించడంతో ప్రపంచ వ్యాప్తంగా మే నెలలో రెండో ఆదివారం మాతృమూర్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
కుటుంబ వారధి..
అన్నిబంధాలకు వారధి, కుటుంబ వ్యవస్థకు సారథిగా ఉంటూ తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎన్ని బాధ్యతలు ఉన్నా తప్పు చేసిన పిల్లలను మొదట్లో దండిస్తూ సన్మార్గంలో నడిపిస్తూ కుటుంబ వారధిగా, సారథిగా తల్లి నిలుస్తుంది.
మాతృమూర్తులను గౌరవించాలి ..
నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లిని సమాజంలో ప్రతి బిడ్డా గౌరవించాలి. సమాజంలో తల్లికి ప్రథమ స్థానం కల్పించే దేశంగా భారతదేశానికి పేరున్నది. భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది. చిన్నప్పటి నుంచి బిడ్డ యోగ క్షేమాలు, బిడ్డ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసిన మాతృమూర్తులపై నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. కుటుంబంలో జరిగే చిన్నచిన్న గొడవలకు తల్లిదండ్రులను బాధ్యులుగా చేయడం సరికాదు. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో బిడ్డల్ని కని తల్లిదండ్రులుగా మారుతారు. తల్లిదండ్రుల విశిష్టతను తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి వివరించి వారికి సరైన గౌరవం ఇవ్వాలి. మాతృమూర్తిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది.
మాతృమూర్తులకు ఆర్టీసీ స్పెషల్ గిఫ్ట్
మదర్స్ డేను పురస్కరించుకొని టీఎస్ ఆర్టీసీ మాతృమూర్తులకు స్పెషల్ గిఫ్ట్‌ను అందిస్తున్నది. ఈ నెల 8 ఆదివారం ఆర్టీసీ బస్సుల్లో చంటిబిడ్డల తల్లులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. త్యాగమూర్తుల సేవలను గుర్తిస్తూ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఐదేండ్లలోపు పిల్లలతో ప్రయాణించే తల్లులకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణ అవకాశమున్నదని తెలిపారు. పల్లె వెలుగు మొదలుకొని ఏసీ బస్సు సర్వీసుల వరకు ఆదివారం ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 1200 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు.