ఖలీల్‌వాడి, మే 6 : నిజామాబాద్ నగర అభివృద్ధిపై జిల్లా పరిషత్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా అంటూ ఎంపీ అర్వింద్‌కు నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి సవాల్ విసిరారు. నిజామాబాద్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.100 కోట్లతో నిజామాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉంటే.. ఎంపీ అర్వింద్ పిచ్చికూతలు చేయడం సరికాదన్నారు. ఎంపీగా గెలిచి మూడేండ్లు అవుతున్నా నగర అభివృద్ధికి ఒక్క పైసా నిధులు కూడా తీసుకురాకపోవడం సిగ్గుచేటన్నారు. నిజామాబాద్ అభివృద్ధిని విస్మరించినందుకే ఆయన తండ్రిని నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఓడించారని గుర్తు చేశారు. అభివృద్ధికి బాసటగా నిలుస్తున్న నేతలను విమర్శించడం మానుకొని, అభివృద్ధికి సహకరిస్తే మంచిదని హితవు పలికారు. నగర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ వద్ద మోకరిల్లి నిధులు తీసుకువస్తే బాగుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువతను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం 89 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుండడం హర్షణీయమన్నారు. సమావేశంలో నుడా డైరెక్టర్లు అంబదాసురావు, రాజేందప్రసాద్, అక్తర్ తదితరులు పాల్గొన్నారు.