ఖలీల్‌వాడి, ఏప్రిల్ 28 : మే 6 నుంచి 24వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ హైదరాబాద్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఇదివరకే జిల్లాస్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 17,553 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 17,969 మంది హాజరుకానున్నారని, మొత్తం 50 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు మంచినీటి వసతి, వైద్య సదుపాయం, నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రశ్నపత్రాలను ఆయా పోలీస్స్టేషన్లలో భద్రపర్చడానికి పోలీసుశాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. అలాగే ఆర్టీసీ అధికారులు పరీక్షల సమయానికి విద్యార్థులకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడులకు గురి కాకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థుల భయాలను తొలగించేందుకు 1800599333 టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచుతున్నామని, 24 గంటలు పని చేస్తుందన్నారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లను, డిపార్ట్మెంట్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే హైపవర్ కమిటీ బృందం, ఫ్లయింగ్, సిట్టింగ్ స్కాడ్ బృందాలను నియమిస్తున్నట్లు వివరించారు. పరీక్షలు నిర్వహించే సమయంలో విద్యార్థులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను కూడా పరీక్ష పూర్తయ్యే వరకూ మూసివేస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్‌తోపాటు అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగరాజు, డీసీపీ ఉషా, జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్, ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, చిరంజీవి, చిన్నయ్యలు పాల్గొన్నారు.