కమ్మర్పల్లి, ఏప్రిల్ 20: అదో పల్లెటూరు.. తెలంగాణ మలి దశ పోరుకు ఊపిరిలూదిన ఊరు. మారుమూలన ఉన్న ఆ గ్రామం ఉద్యమ ‘మోతె’ మోగించింది. స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా రగిలించి, ఉద్యమ స్ఫూర్తిని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. అప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ఏకగ్రీవ తీర్మానాలతో వెన్నుదన్నుగా నిలిచింది. గమ్యాన్ని చేరుకునే వరకు వెంట నడిచి టీఆర్ఎస్ చరిత్రలో చెరగని సంతకంగా నిలిచి పోయింది. బంగా రు తెలంగాణ సాధనలోనూ మద్దతుగా నిలబడుతోంది. ఆ గ్రామమే వేల్పూర్ మండలంలోని మోతె. ఈ గ్రామం అందించిన స్ఫూర్తితో ఉద్యమ నేతగా కేసీఆర్ మోతె మట్టిని ముడుపు కట్టి ఎన్నెన్నో గ్రామాల్లో ఉద్యమ ఆకాంక్షను రగిలించారు.
స్వరాష్ట్ర సాధనోద్యమానికి కేసీఆర్ నడుం కట్టిన వేళ ఆయనతో కలిసి నడిచారు మోతె పక్క గ్రామమైన వేల్పూర్‌కు చెందిన రైతు నేత వేముల సురేందర్‌రెడ్డి. ఆయన తెలంగాణ పోరులో చురుగ్గా పాల్గొన్న తరుణంలో మోతెలోనూ ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ చేస్తున్న మడమ తిప్పని పోరాటాన్ని మోతెలోనూ ప్రచారం చేశారు. అప్పటికే సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్న మోతె గ్రామ ప్రజల్లో ఒకింత నిస్తేజం నెలకొంది. తెలంగాణ సాగు నీటి రంగాన్ని సీమాంధ్ర పాలకులు ఎలా నిర్లక్ష్యం చేశారో కేసీఆర్ ఆ రోజుల్లో విడమర్చి చెప్పిన మాటలు.. గ్రామస్తుల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను పెంచాయి. ఇలాంటి కారణాలతో మోతె వాసులు బలమైన ఉద్యమ ఆకాంక్షతో, కేసీఆర్‌పై ఎనలేని విశ్వాసంతో టీఆర్ఎస్ వెంట నిలిచారు. ఉద్యమంలో టీఆర్ఎస్తో కలిసి నడుస్తామని 2001 మే 5 న గ్రామస్తులంతా ఏకగీవ్రంగా తీర్మానం చేశారు. మోతె చేసిన ఈ తీర్మానం మరెన్నో గ్రామాల్లో స్వరాష్ట్ర ఆకాంక్షను కలిగించి ఉద్యమం వైపు అడుగులు వేయించింది.
మోతె గ్రామం ఆది నుంచి టీఆర్ఎస్కు విజయాలను అందించడంలో భాగం పంచుకుంటున్నది. ఉద్యమ కాలంలో ఎన్నికల వేళ మద్దతుగా నిలిచిన ఈ గ్రామం ప్రశాంత్‌రెడ్డికి 2014, 2019 ఎన్నికల్లో మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేసి అండగా నిలిచింది.
టీఆర్ఎస్కు అండగా నిలిచిన గ్రామానికి.. అధికార పార్టీ అదే స్థాయిలో అండగా నిలుస్తోంది. అభివృద్ధిలో గ్రామాన్ని పరుగులు పెట్టిస్తోంది. గ్రామ చెరువుకు నీటిని అందించే వనరు లేక దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సాగు నీటి సమస్యను తీర్చే వారి కోసం స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు. ఆ సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నెరవేర్చారు. తన ఇంజినీరింగ్ ప్రతిభతో మోతె చెరువు మాటు కాలువకు రూపకల్పన చేశారు. కిలో మీటర్ల దూరంలో వృథాగా పోతున్న నీటిని మళ్లించి, మాటు కాలువను నిర్మించి చెరువుకు నీటిని అందించే శాశ్వత వనరుగా మార్చారు. మోతె వాగులో చెక్ డ్యాం ఏర్పాటు చేయించారు. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి వానాకాలంలో ఎదురవుతున్న రవాణా కష్టాలకు చెక్ పెట్టారు.
మలి దశ తెలంగాణ ఉద్యమంలో మోతె గ్రామస్తులు నిర్వర్తించిన పాత్ర మరువలేనిది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ అడుగు జాడల్లో నడిచిన మోతె అంటే మా నాన్న వేముల సురేందర్‌రెడ్డి ఎంతో అభిమానించే వారు. టీఆర్ఎస్కు ఆది నుంచి అండగా నిలుస్తున్న మోతెలో సాగు నీటి తిప్పలు తీర్చడం ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది. ఇందుకు సీఎం కేసీఆర్ అందించిన సహకారాన్ని నాతో పాటు మోతె గ్రామస్తులు ఎప్పటికీ మరువలేరు.
– వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి
ఏకగ్రీవ మద్దతుగా నిలిచిన కొద్ది రోజుల్లోనే కేసీఆర్ స్వయంగా మోతెకు వెళ్లి గ్రామస్తులను కలిసి ఉద్యమాభినందనలు తెలిపారు. మోతె స్ఫూర్తిని తెలంగాణ అంతటా రగిలించేలా మోతె గడ్డ మీద మట్టినిముడుపు కట్టి తన వెంట తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించాక తిరిగి మోతె గడ్డ మీదనే ముడుపు విప్పుతానని ప్రకటించి ఆ గ్రామ ఉద్యమ స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేశారు. ఉద్యమంలో ఎన్నో గ్రామాలకు మోతె దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014 మార్చి 8న కేసీఆర్, దివంగత ఉద్యమ నేత వేముల సురేందర్‌రెడ్డి, ఆయన తనయుడు, ప్రస్తుత మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మోతెకు వచ్చి ముడుపు విప్పారు. అలాగే 2015 లోనూ గ్రామానికి వచ్చారు.