విద్యుత్ వినియోగం గతం కన్నా విపరీతంగా పెరిగింది. ఉష్ణోగ్రత పెరుగుతుండడంతో ప్రతి ఇంట్లోనూ అవసరానికి ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. ఏ ఇంట్లో ఎంత విద్యుత్ వాడుతున్నారో ఎప్పటికప్పుడు అంచనా ఉంటే తప్ప వినియోగదారులకు తర్వాత వచ్చే బిల్లుల ప్రభావం నుంచి బయటపడలేని పరిస్థితి. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేస్తే.. రెండు యూనిట్లు తయారు చేసినట్లే.. ఇది విద్యుత్ అధికారులు తెలిపే ప్రాథమిక సూత్రం. రోజుకు ఒక యూనిట్ విద్యుత్ భారాన్ని తగ్గించుకుంటే నెలకు రూ.వందల్లో పొదుపు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 17: ఎండలు మండిపోతున్నాయి. బయటే కాదు.. ఇండ్లల్లోనూ కాసేపు ఫ్యాన్ లేకుండా కూర్చోలేని పరిస్థితి. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఫలితంగా విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయికి చేరుకున్నది. ఉదయం 7గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండడంతో ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంటున్నది. ఈ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతున్నది. ఈ క్రమంలో విద్యుత్ బిల్లుల మోత నుంచి తప్పించుకునేందుకు ప్రతి ఒక్కరూ పొదుపుగా విద్యుత్ వాడకం సాగించాలని సంబంధిత శాఖ అధికారులు కోరుతున్నారు.
బల్బులు..
గదుల్లో అనవసరంగా బల్బులు వెలగకుండా చూడాలి. సూర్యకాంతి ఇంట్లోకి వచ్చే కిటికీల దగ్గర రంగురంగుల తెరలను ఏర్పాటు చేసుకోవాలి. బల్బులపై దుమ్ము, ధూళి పడకుండా డి.. డిస్టర్ లైటింగ్ ఫిక్సర్‌ను వాడితే కాంతి ప్రకాశవంతంగా ప్రసరిస్తుంది. గది మొత్తానికి వెలుగు వచ్చే బల్బులు కాకుండా అవసరమైన టాస్క్ లైటింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యత, మన్నిక విషయంలో మామూలు వాటి కన్నా ఎల్ఈడీ బల్బులకు సామర్థ్యం ఎక్కువ.
ఎలక్ట్రానిక్ ఉపకరణాలను చాలా మంది రిమోట్‌తో ఆఫ్ చేస్తుంటారు. ఒక్కో డివైస్ పది వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. రిమోట్‌తో కాకుండా నేరుగా పవర్ ఆఫ్ చేయాలి.
రిఫ్రిజిరేటర్..
రిఫ్రిజిరేటర్కు, గది గోడలకు మధ్య తగినంత ఖాళీ ప్రదేశంలో ఉండాలి. అవసరమైన మేరకు మాత్రమే రిఫ్రిజిరేటర్ చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఉంటే ఐస్పేరుకుపోతుంది. తొలగించే సమయంలో మోటర్ ఎక్కువ సామర్థ్యంతో పనిచేయాల్సి వస్తుంది. రెండు తలుపుల మధ్య ఖాళీ ఉందో లేదో గమనించాలి. ఫ్రిజ్‌లో పెట్టే ప్రతి పదార్థం కవర్‌తో కప్పి ఉండేలా చూసుకోవాలి. లేదంటే పదార్థాల్లోని తేమతో కంప్రెషర్ ఎక్కువ సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుంది. ఊరికే ఫ్రిజ్ తలుపులు మూ యడం, తీయడంతో చల్లగాలి బయటికి వెళ్లిపోతుంది.
ఎలక్ట్రిక్ స్టవ్…
ఎలక్ట్రిక్ స్టవ్‌పై వంట చేసే ముందు చదునైన పాన్ వినియోగిస్తే.. త్వరగా పని పూర్తవుతుంది. నూనె, విద్యుత్ తక్కువే వినియోగమవుతుంది.
ఇస్త్రీ పెట్టె
విద్యుత్‌ను క్రమబద్దీకరించే రెగ్యులేటర్ ఉన్న ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్‌ను కొనుగోలు చేయాలి. దుస్తులు ఇస్త్రీ చేసే సమయంలో ఎక్కువ మొత్తంలో నీరు చల్లకూడదు. తడిగా ఉన్నవి ఇస్త్రీ చేయకూడదు.
ఏసీలు..
ఆటోమెటిక్ టెంపరేచర్ కట్ ఆఫ్ ఉన్న ఏసీలను ఎంచుకోవాలి. ఎప్పుడూ ‘లో కూల్’ స్థితిలో ఉండేలా చూసుకోవాలి. మిద్దెపై తోటలు ఏసీపై పనిభారాన్ని తగ్గిస్తాయి. దీపాలు, టీవీని ఏసీకి దూరంగా ఉంచాలి. థర్మోస్టాట్ ద్వారా సాధారణం కన్నా… ఎక్కువ చల్లగా ఉండేలా సెట్ చేయడంతో గది త్వరగా చల్లబడడమోమేకానీ ఏసీపై అధికభారం పడుతుంది.
కంప్యూటర్లు..
కంప్యూటర్‌తో పని అయిపోయిన తర్వాత చాలా మంది సీపీయూను మాత్రమే ఆఫ్ చేస్తారు. కంప్యూటర్ తీసుకునే విద్యుత్‌లో సగం మానిటర్ వినియోగించుకుంటుంది. మానిటర్నూ ఆఫ్ వేయడం మంచిది. వాడుకలో లేని సమయంలో కంప్యూటర్, మానిటర్లను స్లీప్ మోడ్‌లో పెడితే 40శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
పంకాల వాడకం ఇలా..
పంకా (ఫ్యాన్)లకు ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ వాడడం మంచిది. ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. సీలింగ్ ఫ్యాన్లను కొనుగోలు చేస్తున్న సమయంలో 5స్టార్ రేటింగ్ బీఎల్డీసీ, మోటర్ కలిగిన వాటిని ఎంచుకుంటే 25-50 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.