నిజామాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రైతు కోసం రణం మొదలు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ రాజీలేని పోరాటాలతో దూసుకెళ్తున్నది. తెలంగాణ సాధన కోసంఎలాగైతే ఉద్యమాలు చేసిందో… ఇప్పుడు సీఎం కేసీఆర్ సారథ్యంలో అదే స్థాయిలో కొట్లాటకు సిద్ధమైంది. మన రాష్ట్ర రైతు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టేందుకు చేపట్టిన దశల వారీ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి మొదలైన వివిధ కార్యక్రమాలు ప్రజలు, రైతుల భాగస్వామ్యంతో విజయవంతమయ్యాయి. గల్లీ నుంచి షురూ చేసిన నిరసనలు ఇప్పుడు దేశ రాజధాని స్థాయికి చేరబోతోంది.
ఈ నెల 11న ఏకంగా ఢిల్లీ వేదికగా కేంద్ర సర్కారు తీరును నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వం ధర్నాకు దిగుతుండడంతో బీజేపీ ఆత్మరక్షణలో పడింది. రైతును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్న బీజేపీ కుటిల నీతిని టీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేయడంతో కాషాయ పార్టీ ఏమీ చేయలేక ఆగమాగమవుతున్నది. ఒకసారి రా రైస్ అంటూ.. మరోసారి బాయిల్డ్ రైస్ అంటూ పేచీలు పెడుతూ తెలంగాణ సర్కారుతో గిల్లికజ్జాలు వేస్తున్న మోదీ ప్రభుత్వం మెడలు వంచేలా కేసీఆర్ పకడ్బందీ వ్యూహంతో వెళ్తున్నారు. గులాబీ దళపతి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో చేపడుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి.
వందకు పైగా బాయిల్డ్ రైస్ మిల్లులు…
రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ గందరగోళ ప్రకటనలకు తెర లేపుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎనిమిదేండ్ల క్రితం బాయిల్డ్ రైస్ మిల్లుల కన్నా ఎక్కువగా రా రైస్ మిల్లులే ఉండేవి. ఇప్పుడు కేంద్రం అవలంబించిన విధానాలతో రైస్ మిల్లు వ్యాపారస్తులంతా రా రైస్ మిల్లుల నుంచి బాయిల్డ్ రైస్ మిల్లులకు మారారు. ఇందుకోసం రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టారు. కొత్తగా బాయిల్డ్ రైస్ మిల్లులు సైతం స్థాపించారు. ఉమ్మడి జిల్లాలో గడిచిన మూడేండ్లలో వందకు పైగా బాయిల్డ్ రైస్ మిల్లులు ఏర్పాటు కావడం ఇందుకు నిదర్శనం.
మొదట్లో భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) రాష్ట్రం నుంచి రా రైస్‌ను తగ్గించి బాయిల్డ్ రైస్‌ను ఎక్కువగా తీసుకున్నది. ఇందుకోసం మిల్లుల కన్వర్షన్‌కు 15శాతం సబ్సిడీ కూడా అందించి పారాబాయిల్డ్ రైస్ మిల్లులను ప్రోత్సహించింది. ఇప్పుడేమో మళ్లీ బాయిల్డ్ రైస్ వద్దని, రా రైస్ మాత్రమే కావాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత సమస్యకు చెక్ పడాలంటే గతంలో మాదిరిగానే కేంద్రమే రైతుల నుంచి నేరుగా ధాన్యం కొంటే సరిపోతుంది. కేంద్రం సేకరించిన ధాన్యాన్ని ఏ విధంగా మార్చుకుంటారన్నది వారి ఇష్టాయిష్టాలపైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంతో సంబంధం లేకుండా వారికి నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అప్పుడు బాయిల్డ్ రైస్ మిల్లులను ఎట్లాగైతే ప్రోత్సహించారో ఇప్పుడు రా రైస్ మిల్లులను తిరిగి ప్రోత్సహించుకోవచ్చు.
రైతులకు శాపంగా మోదీ సర్కారు
కేంద్రంలో మోదీ సర్కారు ..రైతుల పాలిట శాపంగా మారింది. 2014లో మోదీ సర్కారు రానంత వరకూ దేశంలో ధాన్యం సేకరణ సమస్య కాలేదు. రైతుల నుంచి ఎఫ్‌సీఐ నేరుగా ధాన్యం సేకరించేది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. ఎఫ్‌సీఐకి తగిన సిబ్బంది లేరని, సరైన వ్యవస్థ లేదన్న కారణాలతో మేం నిధులిస్తాం… ఖర్చులు భరిస్తాం… ధాన్యం సేకరించి బియ్యం చేసి ఎఫ్‌సీఐకి కాస్త అప్పగించండంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం బతిమిలాడింది. ఫెసిలిటెడ్ చేయడమే కదా అని భావించిన రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు ఒప్పుకున్నాయి. ఇప్పుడదే పాపంగా మారిపోయింది.
ఇప్పుడు ధాన్యం సేకరణ బాధ్యతంతా రాష్ర్టాలదేనని కేంద్రం చెబుతుండడం విడ్డూరంగా మారింది. సాగుకు రైతులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. రైతుకు రైతుబంధు, 24గంటల కరెంట్, సాగు నీరు, ఎరువులు, విత్తనాలు అందిస్తోంది. ఉత్పత్తి చేసిన పంటలను మాత్రం కేంద్రమే మద్దతు ధరను నిర్ణయించి కొనాలి. అందుకు విరుద్ధంగా దుష్టనీతితో ధాన్యం సేకరణ వంటి అంశం నుంచి కేంద్రం తప్పించుకునేందుకు పాకులాడుతోంది. కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని అప్పగించేందుకు ఇష్టపడుతున్న మోదీ ప్రభుత్వం నేరుగా రైతన్నలను ఆదుకోవడానికి మాత్రం ఉత్సాహం చూపడంలేదు.
ధాన్యాగారంగా ఉమ్మడి జిల్లా
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాల మూలంగా రాష్ట్రంలో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ధాన్యం సిరులు సైతం భారీగా వెల్లువెత్తుతున్నాయి. పోటెత్తుతున్న వడ్లను సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమై రైతులను ఇతర పంటల వైపు మళ్లించింది. కానీ బీజేపీ మాత్రం కుట్రపూరితంగా రైతులను వరి వేయాలంటూ రెచ్చగొట్టింది. గతంతో పోలిస్తే వరి సాగు కాసింత తగ్గినా 2022 యాసంగిలో దిగుబడులు లక్షల్లో వచ్చే ఆస్కారం ఉంది. ఓ వైపు కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో కిరికిరి పెడుతుండగా రాష్ట్ర సర్కారు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేస్తోంది. 2021-22 వానకాలంలో నిజామాబాద్ జిల్లాలో 6,55,400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ.1300 కోట్లు చెల్లించి ప్రభుత్వం సేకరించింది. కామారెడ్డి జిల్లాలో 4,59,875 మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.899.99 కోట్లు వెచ్చించింది. కేసీఆర్ సాగు అనుకూల చర్యలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని బీడు భూములు పచ్చబడుతున్నాయి. ధాన్యాగారమై వెలుగొందుతున్నాయి.