బోధన్ రూరల్/ వేల్పూర్/ ముప్కాల్, ఏప్రిల్ 9 : నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నూతన భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ. 16 లక్షలు మంజూరు చేయడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు శనివారం క్షీరాభిషేకం చేశారు. బోధన్ మండలంలోని కుమ్మన్‌పల్లి, కొప్పర్గ, పెంటాకుర్దూ, అమ్దాపూర్ గ్రామాలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలకు నిధులు మంజూరయ్యాయి. సాలూరా పీహెచ్సీలో ఎంపీపీ బుద్దె సావిత్రి, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే షకీల్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సన్న, సిర్ప సుదర్శన్, రైతుబంధు సమితి మండల మాజీ కన్వీనర్ బుద్దె రాజేశ్వర్, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు బుయ్యన్ చంద్రకళ, కృష్ణ, కృష్ణారెడ్డి, కండెల సవిత, కండెల సంజీవ్, కేజీ గంగారాం, బుయ్యన్ సురేశ్, చందూర్ సాయిరెడ్డి, మౌలానా, కుర్మె రాజు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలంలోని లక్కోరాలో ఆరోగ్య ఉపకేంద్రం, ముప్కాల్ మండలం వేంపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కావడంపై సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వేంపల్లి సర్పంచ్ జక్క మల్లుబాయి, వార్డుసభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, యువజన సంఘాల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, సృజన్, చిన్నారెడ్డి, సంపత్ పాల్గొన్నారు.