నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 9 : రాష్ట్రప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయనున్న నేపథ్యంలో అందజేస్తున్న ఉచిత కోచింగ్‌ను ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. అర్హత పరీక్షలో ప్రతిభ కనబర్చి ఫ్రీ కోచింగ్‌కు ఎంపికైన 1,095 మంది అభ్యర్థులకు నిజామాబాద్ నగరంలోని పోలీస్‌పరేడ్ గ్రౌండ్లో ఫిజికల్ టెస్టులు చేయడంతో పాటు సర్టిఫికెట్లను శనివారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పక్కా ప్రణాళికతో నిర్విరామంగా కష్టపడాలని సూచించారు. పోలీస్‌శాఖలో ఉద్యోగాలు భారీ సంఖ్యలో ఉన్నందున ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించేందుకు కృషిచేయడంతోపాటు ఇతర గ్రూప్ పరీక్షలకు సైతం ప్రిపేర్ కావాలని అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ కోచింగ్‌లో జిల్లాలో 200 మంది ఎస్టీలు, 300 మంది ఎస్సీలు, 200 మంది మైనార్టీలకు ఫ్రీ కోచింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని వివరించారు. 6 నెలల్లోగా సుమారు 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయనున్నారని, ప్రభుత్వం అందజేసే కోచింగ్, మెటీరియల్స్‌ను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలను సాధించాలన్నారు. జిల్లాలో సుమారు 2 వేల మంది అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఉచిత కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
– సీపీ కేఆర్. నాగరాజు
ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత శిక్షణను ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని సీపీ కేఆర్. నాగరాజు అన్నారు. బాసర జోన్లో దాదాపు 1000 పోస్టులు ఉండే అవకాశం ఉందని, ఇందులో నిజామాబాద్‌కు సుమారు 500 ఉండే అవకాశం ఉందని చెప్పారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సూచనల మేరకు కలెక్టర్, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంచి ఫ్యాకల్టీతోపాటు స్టడీ మెటీరియల్‌ను సిద్ధం చేయించారని అన్నారు. పోలీసు ఉద్యోగార్థులకు మంచి నైపుణ్యత కలిగిన ఫిజికల్ డైరెక్టర్స్‌తో కోచింగ్ ఇస్తామని చెప్పారు. పోలీసు ఉద్యోగాలు సాధించేందుకు ఎత్తు ఎక్కువగా ఉండాలని, ఎత్తు లేని వారు నిరుత్సాహపడకుండా గ్రూప్స్ కోసం ప్రిపేర్ కావాలని అన్నారు. ఇందుకోసం బాల్కొండలో అందజేస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం అభ్యర్థులకు ఫిజికల్ టెస్టులు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు డాక్టర్ వినీత్, ఉషావిశ్వనాథ్, నరేందర్ రెడ్డి, గిరిరాజు, ట్రాఫిక్ ఏసీపీలు వెంకటేశ్వర్, ప్రభాకర్‌రావు, ఆర్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
ఈ నెల 16న ఆన్లైన్లో అర్హత పరీక్ష
నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 9 : బీసీ స్టడీసర్కిల్ ఆధ్వర్యంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు గ్రూప్స్, పోలీసు ఉద్యోగాల కోసం ఉచిత కోచింగ్‌తోపాటు ైస్టెఫండ్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ వెంకన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ పొందేందుకు ఈనెల 16వ తేదీన అర్హత పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తామని, కోచింగ్‌కు ఎంపికైన గ్రూప్-1 అభ్యర్థులకు ఆరు నెలలపాటు నెలకు రూ.5 వేలు, పోలీసు అభ్యర్థులకు మూడు నెలల పాటు నెలకు రూ.2 వేలు ైస్టెఫండ్తోపాటు కోచింగ్ ఇస్తామని వివరించారు. మరిన్ని వివరాలకు నిజామాబాద్ నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న బీసీ స్టడీసర్కిల్ కార్యాలయంలో లేదా 08462-241055 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.