నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 8: జిల్లా కేంద్రంలో వారంరోజుల క్రితం జరిగిన బాలుడి హత్యకేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితురాలిని గుర్తించారు. తొమ్మిదేండ్ల క్రితం జరిగిన ఓ సంఘటనతో కక్ష పెంచుకున్న ఓ మహిళ అభం శుభం తెలియని బాలుడిని హత్యచేసినట్లు విచారణలో తేలింది. గత నెల 31వ తేదీన ఆరో టౌన్పోలీసు స్టేషన్ పరిధిలో షేక్ అర్హన్ (7)ను హత్య చేసిన కేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితురాలి వివరాలను శుక్రవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ కె.ఆర్.నాగరాజు వెల్లడించారు. నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన రుక్సానా బేగం(40), మరో బాలికతో కలిసి ఆటోనగర్‌కు చెందిన షేక్ అర్హన్‌ను ఆటోరిక్షాలో బోధన్‌కు తీసుకెళ్లింది. సాయంత్రం మళ్లీ నిజామాబాద్‌కు వచ్చి బాలుడిని తన కొడుకు అంటూ తనకు తెలిసిన వారి ఇంట్లో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయింది. షేక్ అర్హన్ కనిపించడంలేదంటూ తల్లి సనాహా బేగంతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండడంతో అక్కడికి రుక్సానా బేగం వచ్చి వారితో పాటు వెతుకుతున్నట్లు నాటకమాడింది.
రాత్రి పది గంటల సమయంలో మళ్లీ అక్కడి నుంచి బాలుడిని ఉంచిన ఇంటికి వచ్చి బయటికి తీసుకెళ్లింది. బాలుడి చేతులు బంధించి, నోట్లో గుడ్డలు కుక్కి నిజాంసాగర్ కెనాల్లో పాడేసి వెళ్లిపోయింది. తొమ్మిదేండ్ల క్రితం రుక్సానాబేగం కుమారుడు ఫైజల్‌ఖాన్ నీటి కుంటలో పడి మృతి చెందాడు. తన కుమారుడి మృతికి షేక్ అర్హన్ తల్లి సనాహా బేగం కారణమంటూ అప్పటి నుంచి కక్ష పెంచుకుంది. తల్లిపై ఉన్న కోపాన్ని బాలుడిపై తీసుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించిందని సీపీ తెలిపారు. నిందితురాలు బాలుడికి వరుసకు అత్తమ్మ అవుతుందని చెప్పారు. నిందితురాలిని రిమాండ్‌కు తలించడంతో పాటు ఆమెకు సహకరించిన బాలికను జువైనల్ హోమ్‌కు తరలించే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన అదనపు డీసీపీ డాక్టర్ వినీత్, ఏసీపీ వెంకటేశ్వర్‌తోపాటు సీఐ నరేశ్, ఎస్సై ఆంజనేయులు,సీసీఎస్ సురేశ్, సిబ్బంది జగదీశ్, కిరణ్ కుమార్, లక్ష్మణ్, నిఖిల్,సాబిర్ను అభినందించారు. ప్రశంసాపత్రాలు, రివార్డులు అందజేశారు.