నిజాంసాగర్, ఏప్రిల్ 8: మండలంలోని ఏ గ్రామంలో చూసినా కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, హార్వేస్టర్ల చప్పుళ్లు.. ఏ దళిత కుటుంబం ఇంటి ముందు చూసినా పలు వాహనాల కంపెనీల ప్రతినిధులతోపాటు తాత్కాలిక షోరూంల ఏర్పాటుతో సందడి వాతావరణం నెలకొని ఉంది. సీఎం కేసీఆర్ నిజాంసాగర్‌ను దళితబంధు పథకం పైలట్ మండలంగా ప్రకటించడంతో ప్రతి గ్రామంలో దళితులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని యూనిట్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే కలెక్టర్ పలుమార్లు దళితులతో సమావేశాలను ఏర్పాటు చేసి వారు ఎంచుకున్న యూనిట్లపై అవగాహన కల్పించారు. దళితబంధు పథకం కింద లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్‌ను నేరుగా వారి ఇంటి వద్దకే కంపెనీల ప్రతినిధులు కొటేషన్లను అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి వాహనాల పనితీరు గురించి అవగాహన కల్పిస్తున్నారు. పోటాపోటీగా వివిధ కంపెనీల ప్రతినిధులు పర్యటిస్తుండడంతో గ్రామాలు సందడిగా మారాయి. ఏకంగా గ్రామాల్లోనే షోరూంలను ఏర్పాటు చేసి వాహనాలను ప్రదర్శిస్తుండడంతో ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దళితబంధుతో దళితుల జీవితాల్లో మార్పు రానున్నదంటూ చర్చించుకుంటున్నారు.