ఇందూరు, ఏప్రిల్ 8 : వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లను వెలువరించనున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉన్న ప్రాంతీయ గ్రంథాలయాన్ని శుక్రవారం సందర్శించి సదుపాయాలు, అందుబాటులో ఉన్న పుస్తకాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత మినహా అన్ని సదుపాయాలు ఉన్నాయని లైబ్రేరియన్ లక్ష్మీరాజ్యం కలెక్టర్ దృష్టికి తీసకురాగా, సమస్యను పరిష్కరిస్తామన్నారు. మెరుగైన వసతులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. శానిటేషన్ కోసం సిబ్బందిని ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. అన్ని వసతులు ఉన్న ప్రాంతీయ లైబ్రరీపై ప్రచారం కల్పించాలని సూచించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులకు అవసరమ్యే అన్ని పుస్తకాలను తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీజినల్ లైబ్రరీ తెరిచి ఉంటుందని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మన-ఉరు మనబడి, ఉపాధి హామీలో ప్రగతి కనిపించాలి
మన ఉరు-మనబడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన వివరాల నివేదికను వెంటనే అందించాలని, ఉపాధి హామీ పనుల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి పలు సూచనలు చేశారు. అనుమతులు మంజూరైన 19 బడులకు సంబంధించి తదుపరి ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. ఉపాధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.