నిజామాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళితబంధు పథకం ద్వారా రూ.10లక్షల విలువ చేసే యూనిట్లతో పేద కుటుంబాలను ఉన్నతికి తీసుకురావాలన్నదే ప్రభుత్వ సంకల్పం. సర్కారు భారీ లక్ష్యంతో దళిత కుటుంబాల ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేయాలనే ఆలోచనతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. పథకం విలువకు తగ్గట్లుగా యూనిట్లు స్థాపించి ఇవ్వడం ద్వారా లబ్ధిదారులు నేరుగా ఆదాయాన్ని సమకూర్చుకునేలా దళితబంధును డిజైన్ చేశారు. ఉదాహరణకు ఎలాంటి ఆదరణలేని దళితకుటుంబానికి రూ.10లక్షలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ మొత్తంతో లబ్ధిదారుడు ఇష్టానుసారంగా ఏదేని పరిశ్రమను స్థాపించుకోవచ్చు. వంద రకాల యూనిట్లను ఇందుకోసం సిద్ధం చేశా రు. ఇందులో లబ్ధిదారుడికి డ్రైవింగ్‌లో నైపుణ్యం ఉంటే కారు, ట్రాక్టర్, ఐచర్, ఆటో వంటివి కొనుగోలు చేసి నడుపుకొనేలా అవకాశం కల్పించారు. రవాణేతర యూనిట్లను సైతం ఎంపిక చేసుకుంటే వాటిని నేరుగా ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం కొనుగోలు చేసి వారికి ప్రభుత్వమే అందిస్తుంది. గడిచిన రెండు నెలలుగా జరిగిన దళితబంధు యూనిట్ల ఎంపిక ప్రక్రియ మార్చి మొదటి వారానికే పూర్తి కాగా బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని పలువురు లబ్ధిదారులకు యూనిట్లను చేతికి అందివ్వబోతున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌తో పాటు ఎమ్మెల్యేలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని దళితబంధు లబ్ధిదారులతో ముఖాముఖి కానున్నారు.
యూనిట్ల పంపిణీకి సర్వం సిద్ధం…
దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారుడు తనకు ఇష్టమొచ్చిన యూనిట్‌ను స్థాపించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం నూటికి నూరు శాతం రాయితీతో ఆర్థిక సాయం అందిస్తుండగా తన జీవన గమనానికి శాశ్వత ఉపాధి పొందేందుకు ఏ యూనిట్‌నైనా ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ఎలాంటి కండీషన్లు లేకుండా ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో భాగంగా ఉభయ జిల్లాల్లో దళితబంధు కింద ఎంపికైన లబ్ధిదారులంతా తమ ఆప్షన్లను ఇప్పటికే సంబంధిత అధికారులు అందించారు. వారు ఇచ్చిన యూనిట్ ప్రకారం వాటిని కొనుగోలుకు ప్రాసెస్ మొదలైంది. రవాణా సంబంధిత వాహనాలు ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చేరగా వాటిని మంగళవారం నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 223 మందికి యూనిట్లు, కామారెడ్డిలో 42 మందికి యూనిట్లు అందివ్వబోతున్నారు. రుద్రూర్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా యూనిట్లు పంపిణీ చేయబోతున్నారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొననున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్ కార్యక్రమంలో పాల్గొని యూనిట్లు అందివ్వబోతున్నారు.
మూడు నెలల కసరత్తు…
దళితబంధు పథకం ప్రారంభించిన తర్వాత కొద్ది రోజులకు ప్రభుత్వం అసెంబ్లీకి వంద యూనిట్లు మంజూరు చేసింది. ఈ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలివ్వడంతో జిల్లా యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేయడం మొదలెట్టింది. ఎమ్మెల్యేలతో సమావేశాలు ఏర్పాటు చేయడం, దళిత కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సర్వే చేయడం వంటి కార్యక్రమాలు చేశారు. ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసిన లబ్ధిదారులతో ప్రభుత్వ పరంగా బ్యాంక్ ఖాతాలు తెరవడం, యూనిట్ల స్థాపనపై అవగాహన కల్పించడం వంటి ప్రక్రియ నెలన్నర రోజుల పాటు సాగింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మంజూరైన ఈ యూనిట్లకు రూ.10లక్షలు ఈ మధ్యనే జమ అయ్యాయి. దీంతో దళితబంధు లబ్ధిదారులంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగంతో సంప్రదింపులు చేసి తమ అనుభవాలను పంచుకున్నారు. వారి సలహా, సూచనలు పరిగణలోకి తీసుకుని తమకు నచ్చిన యూనిట్‌ను లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్నారు. ఎక్కువ మంది రవాణా సంబంధిత యూనిట్లవైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కార్లు, ఐచర్లు, ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వైపు ఆసక్తి చూపిన వారున్నారు. మరికొంత మంది గొర్రెలు, మేకలు, పాడి పరిశ్రమ, కిరాణ దుకాణాలు వంటివాటిపై దృష్టి పెట్టారు.
వెలుగు దారులు…
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రావు ఆశయ సాధనలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పయనిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న దళితబంధు పథకం చరిత్రాత్మకంగా నిలువబోతోంది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకు ఏ పాలకులు ఆలోచించని విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండడం సాహసోపేతమైందిగా ఇప్పటికే ఆయా వర్గాల మేధావులు కొనియాడుతున్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే దళితకుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలుకు నిర్ణయించడం, అన్నట్లుగానే రూ.10లక్షలు మంజూరు చేసి ఏకంగా యూనిట్లను లబ్ధిదారులకు అందిస్తుండడంతో దళిత సమాజంలో ఆనందం వెల్లివిరుస్తోంది. దళిత వర్గాలను పైకి తీసుకు వచ్చేందుకు సీఎం కేసీఆర్ పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఆది నుంచి అట్టడుగులో కొట్టుమిట్టాడుతున్న వర్గాలకు చేయూతగా కేసీఆర్ నిలుస్తూ వచ్చారు. ఆదరణ కరువై, ఉపాధి లేక సతమతం అవుతున్న వారిలో దళితబంధు పథకం ఓ వెలుగు దారిని చూపిస్తోంది. శాశ్వత ఉపాధితో దళిత కుటుంబం ఒకరిపై ఆధారపడుకుండా నిలదొక్కుకునేలా కేసీఆర్ పాటుపడుతుండడం విశేషం.