వేల్పూర్, ఏప్రిల్ 4: కేంద్రం వడ్లు కొనేవరకూ బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో వేల్పూర్ మండల కేంద్రం లో సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చబడితే కేంద్రం ఓర్వలేకపోతున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు, 24గంటల ఉచిత కరెంట్, పంట పెట్టుబడి సాయం,రైతుబీమా వంటి పథకాలు అందిస్తుంటే బీజేపీ వాళ్లకు పుట్టగతులు ఉండవని కేసీఆర్ కాళ్ల లో కట్టెలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీవి అన్ని అబద్ధాలే అన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కేసీఆర్ అమలుచేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలు లేవన్నారు. దీంతో వాళ్ల రాష్ర్టాల్లో ప్రజలు నిలదీస్తున్నారన్నారు. కేసీఆర్ కృషితో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడి పెరిగిందన్నారు. రెండేండ్లుగా మోదీ ప్రభుత్వం ధాన్యాన్ని కొనేందుకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. వడ్లు కొనాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రుల బృందం వెళ్లి కలిస్తే కొనబోమని తెగేసి చెప్పారని గుర్తుచేశారు.
పైగా తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానించేలా మాట్లాడారని, ఆ వ్యాఖ్యలు బాధను కలిగించాయన్నారు. ఇక్కడి బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా ఢిల్లీ బీజేపీ సంకలో చేరి వారి మాటలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే ఇవ్వలేమని సోనియాగాంధీ అన్నందుకే అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కోసం అక్కరకు రాని పదవి తనకు అనవసరమని కేసీఆర్ వెంట్రుకతో సమానంగా విసిరి కొట్టారన్నారు. అది తెలంగాణ పౌరుషం అని మంత్రి అన్నారు. కానీ కేంద్ర మంత్రి కండ కావరంతో తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అవమానిస్తే ఇక్కడి బీజేపీ నాయకుల సప్పుడు లేదన్నారు. కేంద్రం మెడలు వంచైనా వడ్లు కొనిపిస్తామని స్పష్టం చేశారు. నిరసన దీక్షా శిబిరంలో వివిధ సందర్భాల్లో వరి వేయాలని బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టిన వీడి యోలను ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా మంత్రి ప్రదర్శించి చూపిం చారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, సొసైటీ చైర్మన్లు మోహన్‌రెడ్డి, యాళ్ల హన్మంత్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యుడు మిట్టపల్లి మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.