ఆర్మూర్/మాక్లూర్/నందిపేట్, ఏప్రిల్ 4 : తెలంగాణ వడ్లు కొనాలనే డిమాండ్‌తో రైతులతో కలిసి ఢిల్లీపై దండయాత్ర చేస్తామని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. వడ్లు కొనే వరకూ కేంద్రాన్ని వదిలేది లేదని స్పష్టం చేశారు. అన్నం పెట్టే రైతులకు సున్నం పెడుతున్న బీజేపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వడ్లు కొనాలనే డి మాండ్‌తో ఆర్మూర్, మాక్లూర్‌లో సోమ వారం నిర్వహించిన నిరసన దీక్షతోపాటు నందిపేట్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నా లో పాల్గొని మాట్లాడారు. నూకలు తినాలని అవమానించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు చుక్కలు చూపిస్తామన్నారు. ఇక్కడి బీజేపీనాయకులు వడ్లు కొనాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని, వట్టి చేతులతో వస్తే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వరకు తరిమికొడుతామని హెచ్చరించారు. బీజేపీ ట్రిపుల్ ఆర్, కాంగ్రెస్ డబుల్ ఆర్, తొండి సంజయ్, టూరిస్ట్ మంత్రి కిషన్‌రెడ్డిని తిరగనిచ్చే ప్రసక్తే లేదన్నారు.
పంజాబ్‌కో నీతి.. తెలంగాణకు మరో నీతా ? అని ప్రశ్నించారు. ఎల్-3 ఎంపీ అర్వింద్ బెండు తీస్తామన్నారు. వడ్లు కొనాలని రోడ్డు ఎక్కిన రైతుల ఆవేదన బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు పట్టడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రైతుల మేలు కోరే వారైతే పార్లమెంట్లో తమ ఎంపీలతో కలిసి ఆందోళన చేయాలని సూచించారు. రైతుల పక్షాన ఉండకుం డా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతులపై కూడా రాజకీయాలు చేస్తే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. 2 కోట్ల 50 లక్షల మెట్రి క్ టన్నుల వడ్లు పండించి దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్ర రైతుల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. దేశాన్ని సాకుతున్న నాలుగు రాష్ర్టాల్లో ఒక్కటైన తెలంగాణపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ది ప్రజాప్రభుత్వమన్నారు. కేవలం రైతు సంక్షేమం కోసమే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం తమని అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని సూచించారు. పసుపు బోర్డు ఏర్పాటుతోపాటు వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలా దమ్ముంటే మాట్లాడాలన్నారు. గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడడం బీజేపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అన్నా రు.
నిరసన దీక్షలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, సత్యసాయి సేవా సంఘం నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత , ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, సొసైటీ చైర్మన్లు సోమ హేమంత్‌రెడ్డి, పెంట భోజారెడ్డి, గడ్డం శ్రావణ్‌రెడ్డి, బంటు మహిపాల్, కల్లెం భోజారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు లింబారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గంగారెడ్డి, కౌన్సిలర్లు గంగామోహన్ చక్రు, హన్మాండ్లు, లిక్కి శంకర్, మాక్లూర్ ఎంపీపీ మాస్త ప్రభాకర్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సత్యం, రైతుబంధు కన్వీనర్ రజినీష్, విండో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, నందిపేట ఎంపీపీ వాకిడి సంతోష్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్ పాల్గొన్నారు.