ఖలీల్వాడి/ నిజాంసాగర్, మార్చి 31: ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రానున్న నాలుగు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ ఒకటి రెండు తేదీల్లో రాష్ట్రంలోని ఉత్తర వాయువ్య జిల్లాల్లో వడగాలులు వీచే ప్రమాదం ఉన్నదని అధికారులు తెలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గురువారం 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో నిజామాబాద్, కామారెడ్డి సైతం ఉన్నాయి. ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం గురువారం నుంచి పాఠశాలలు సైతం 11:30 గంటల వరకే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నది.
అప్రమత్తమైన ప్రభుత్వం
వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వడ దెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అందుకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచడం, అగ్నిమాపక శాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడం, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం, పాఠశాలల సమయపాలన కుదించడం వంటి చర్యలు తీసుకుంటున్నది. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు తప్పని సరిగా తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్లాలని వైద్యులు తెలుపుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు బయటికి రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. మధ్యాహ్నం ఎండలో తిరగకుండా ఉండాలని ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
పిల్లల విషయంలో జాగ్రత్త..
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాల వేళల్లో మార్పులు చేశారు. విద్యార్థులు ఇంటికి చేరుకునే సమయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని నిజామాబాద్ జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలలు 11.30 నిమిషాల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని, ఆ తరగతులు నిర్వహించినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.