ఆర్మూర్, మార్చి 31 : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కిట్‌లో 18/96 సర్వే నంబరులోని ఉన్న ఐదుశాతం స్థలం కబ్జాకు గురికాకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ స్థలంలో కంచెవేయడంతోపాటు, అది మున్సిపల్ స్థలంగా పేర్కొంటూ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. 18/96 సర్వేనంబరులోని స్థలాన్ని 2017లోనే కొందరు కబ్జాచేశారు. అప్పట్లో ఈ స్థలం పెర్కిట్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండగా.. కబ్జాపై అప్పట్లో నమస్తే తెలంగాణ దినపత్రిక వరుస కథనాలను ప్రచురించింది. ఈ కథనాలతో పంచాయతీ స్థలం కబ్జాకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్పటి జిల్లా పంచాయతీ అధికారి కృష్ణమూర్తి, ఆర్మూర్ ఈఓపీఆర్డీ దామోదర్, పెర్కిట్ పంచాయతీ కార్యదర్శి గుర్రం శ్రీనివాస్, అప్పటి పెర్కిట్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత పెర్కిట్, కోటార్మూర్ గ్రామపంచాయతీలు ఆర్మూర్ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి.
5 శాతం స్థలంపై అప్పటివరకు గ్రామపంచాయతీకి ఉన్న అధికారాలు మున్సిపాలిటీకి బదలాయించబడ్డాయి. గతేడాది చివరలో జగదీశ్వర్‌గౌడ్ మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. పట్టణ అవసరాలకు ఉపయోగపడుతాయన్న సదుద్దేశంతో బాధ్యతలు తీసుకున్నప్పటినుంచీ ఆర్మూర్ పట్టణంలోని వివిధ వెంచర్లలలోని మున్సిపల్ రిజర్వుడ్ స్థలాలను ఆయన స్వాధీనం చేసుకుంటూ వస్తున్నారు. అవి కబ్జాకు గురికాకుండా కంచెలు, బోర్డులను ఏర్పాటు చేయిస్తున్నారు. పట్టణంలోని 23వ వార్డులోని ఐదుశాతం స్థలం విషయంలోనూ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ చొరవ తీసుకున్నారు. మున్సిపల్ అధికారులను అప్రమత్తం చేసి ఎంజే దవాఖాన పక్కనున్న ఆ స్థలం చుట్టూరా కంచెను వేయించారు. ఇతరులెవరూ కబ్జా చేయరాదని పేర్కొంటూ ప్రత్యేకంగా బోర్డులను ఏర్పాటు చేయించారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ చర్యలపై ఆర్మూర్, మామిడిపల్లి, పెర్కిట్, కోటార్మూర్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కంచె వేసి, బోర్డులను ఏర్పాటుచేశాం..
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 10శాతం, 5 శాతం మున్సిపల్ స్థలాలను కబ్జాకు గురి కానివ్వకుండా చూస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడే సామాజిక పనుల కోసం ఆ స్థలాలను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మున్సిపల్ 23వ వార్డులో కబ్జాకు గురైన 5శాతం స్థలాన్ని స్వాధీనం చేసుకుని చుట్టూ కంచెను ఏర్పాటు చేశాం. మున్సిపల్ బోర్డులను సైతం పెట్టించాం. మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు ఓపెన్ జిమ్, పార్కు ఏర్పాటు కోసం ఇటీవల భూమిపూజ చేసినట్లు తెలిసింది. ఓపెన్‌జిమ్, పార్కు కోసం నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభించుకుంటాం. ఆర్మూర్ మున్సిపల్లో ఎక్కడైనా 10 శాతం స్థలం కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం.