రుద్రూర్ (కోటగిరి), మార్చి 31 : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగర్గాఫారంలో పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు రూ. 10 కోట్లతో 25 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఒక డబుల్‌బెడ్ రూం ఇంటితోపాటు 20 సీసీ కెమెరాలను కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజుతో కలిసి ప్రారంభించారు. 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను సాధించుకున్న ఏకైక నియోజకవర్గం బాన్సువాడనే అని స్పీకర్ అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 80 ఫంక్షన్‌హాళ్లను నిర్మించి ఇచ్చామని తెలిపారు. మహిళల వినతి మేరకు మహిళా మండలి భవన నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
సీపీ నాగరాజు మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ప్రధానపాత్ర పోషిస్తాయని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వం పోలీసు శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వేయనుందని, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణను యువత సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలో అభివృద్ధి జరుగుతున్నదనడానికి 25 అభివృద్ధి పనులకు చేసిన శంకుస్థాపనలే నిదర్శనమన్నారు. ఈ వయస్సుల్లో కూడా స్పీకర్ పోచారం తీరిక లేకుండా గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించడం ఆయనకే చెల్లిందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు శంకర్‌పటేల్, సర్పంచ్ ఎజాజ్‌ఖాన్, వైస్ ఎంపీపీ గంగాధర్, ఏఈ నాగేశ్వర్రావు, విజయ డెయిరీ డీడీ నందకుమారి, డీపీవో జయసుధ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.