భీమ్‌గల్, మార్చి 31 : తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నదని, బండి సంజయ్‌కి దమ్ముంటే ప్రధాని మోదీని ఒప్పించి తెలంగాణ వడ్లను కేంద్రంతో కొనుగోలు చేయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ విసిరారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం ముచ్కూర్‌లో చిన్నవాగుపై రూ.1.75 కోట్లతో రెండు చెక్‌డ్యాములు, జాగిర్యాలలో ఉడిపివాగుపై రూ 84.80 లక్షలతో ఒక చెక్‌డ్యాం నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రాజెక్టులు, చెక్‌డ్యాములను నిర్మించడంతో సాగు విస్తీర్ణం పెరిగి ధాన్యం దిగుబడులు గణనీయయంగా పెరిగాయని అన్నారు. ధాన్యం దిగుబడులను కేంద్రం కొనుగోలు చేయకుండా రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నదన్నారు. కేంద్రం ఇలా చేస్తున్నదన్న ముందుచూపుతో రైతులు ఇబ్బందులు పడవద్దన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వరిసాగు తగ్గించాలని రైతులను కోరారని గుర్తుచేశారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ వడ్లను కొనుగోలు చేయిస్తానని, రైతులు వరిని సాగుచేయాలని రెచ్చగొట్టారని అన్నారు. సంజయ్.. చెప్పినట్లుగా ఇప్పుడు కేంద్రంతో వడ్లు కొనుగోలు చేయించాలని, లేదంటే తెలంగాణలో తిరగవద్దని సవాల్ విసిరారు. రైతులకు నూకలు అలవాటు చేయాలన్న కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. చివరి ప్రయత్నంగా ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి పంపుతున్నామన్నారు. కేంద్రం మొండికేస్తే మెడలు వంచి వడ్లు కొనేలా చేద్దామన్నారు.
మార్చి నెలాఖరులోనూ పచ్చని పంటలు..
కేసీఆర్ సహకారంతో చేపట్టిన సాగునీటి రంగ అభివృద్ధి మూలంగా మార్చి నెలాఖరులోనూ పచ్చని పంటలను చూస్తున్నామన్నారు. ముచ్కూర్, జాగిర్యాల్‌లో చెక్‌డ్యాములు నిర్మిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందన్న రైతుల మాటను సీఎం కేసీఆర్‌కు విన్నవించినట్లు చెప్పారు. చెక్‌డ్యాముల మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్‌కు ఆయా గ్రామాల ప్రజల తరఫున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జాగిర్యాల్‌లో చేపడుతున్న చెక్‌డ్యాం ఫలితాలను చూసిన తర్వాత ఇదేవాగుపై మరో చెక్‌డ్యాం మంజూరుకు కృషిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌చైర్మన్ రమేశ్‌రెడ్డి, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ సభ్యుడు రవి, నీటిపారుదలశాఖ ఈఈ భానుప్రకాశ్, ఆర్డీవో శ్రీనివాసులు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మోయిజ్, ఆయా గ్రామాల సర్పంచులు మాసన, జ్యోతి, ఎంపీటీసీలు సుమలత, రాజేశ్వర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.