ఆర్మూర్, జూలై 8 : హైదరాబాద్‌లో సోమ వంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసేందుకు హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రాంతీయ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ రవీందర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో మంత్రిని శుక్రవారం కలిసి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 30 గుంటల భూమిలో వచ్చేనెల 14వ తేదీన భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాలని కోరారు. కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అఖిల భారత సంఘ ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ బాలకిషన్, ప్రతినిధులు టంకు విష్ణు, పూజారి రాజేశ్వర్, దినేశ్ వైద్య, ఖాందేశ్ శ్రీనివాస్, ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్, న్యాయవాది సంగీతా ఖాందేశ్ తదితరులు పాల్గొన్నారు.
దేవాంగ సంఘానికి స్థలం కేటాయింపుపై హర్షం
హైదరాబాద్‌లో దేవాంగ సంఘ ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి రూ.30 కోట్ల విలువైన 33 గుంటల స్థలాన్ని కేటాయించడంపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సంఘం తరఫున కృతజ్ఞతలు చెప్పారు.