ఇందూరు/కామారెడ్డి, జూలై 8 : మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 15వ తేదీ నుంచి సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. సదస్సులను పకడ్బందీగా నిర్వహించి, విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో ఆయన శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ ఖరారు చేసుకొని, అందుకు అనుగుణంగా ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. సదస్సుల నిర్వహణ వేదికల వద్ద మొబైల్ ఈ-సేవ కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సదస్సుల్లో స్వీకరించే ప్రతి దరఖాస్తుకూ రసీదులు ఇవ్వాలని సూచించారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సమావేశానికి జిల్లా కలెక్టర్లు అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు.