నిజామాబాద్ క్రైం, జనవరి 27 : పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కే.ఆర్.నాగరాజు గురువారం సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ ప్రాంతానికి చెందిన కంచి శివ ప్రసాద్, సంలేటి అక్షయ్ కుమార్, ఆనంద్ కృష్ణహరి కోడం, ప్రేమ్ భాస్కర్ ముఠాగా ఏర్పడ్డారు. వీరు కొంత కాలంగా నిజామాబాద్ నగరంలోని వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటూ ఎవరికీ అనుమానం రాకుండా ముందుగా తాళం వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుంటారు. నిత్యం నగరంలోని ఏదో ఒక ఏరియాలో రెక్కీ నిర్వహించి తమకు అనుకూలంగా ఉండే ఇండ్లల్లో దొంగతనం చేసేందుకు పథకం వేస్తారు. ఈ నెల 16వ తేదీన నీలకంఠ నగర్‌లోని ఓ ఇంట్లో, 24వ తేదీన నగరంలోని గంగాస్థాన్ ఫేస్-2లోని ఓ అపార్ట్మెంట్లో చోరీలకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి సైతం మారుతీనగర్‌లో చోరీకి యత్నించారు. దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా పెట్రోలింగ్ చేపట్టారు. ఇందులో భాగంగానే డీసీపీ అరవింద్ బాబు పర్యవేక్షణలో నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీనగర్‌లో అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని బుధవారం అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు చోరీలు చేసినట్లు అంగీకరించారని సీపీ వెల్లడించారు. బాధితురాలు తోట విజయ ఫిర్యాదు మేరకు నిందితులపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్సై లింబాద్రి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన వీరి వద్ద నుంచి 8 తులాల బంగారు నగలు, 27 తులాల వెండితో పాటు ఒక ఎల్ఈడీ టీవీ, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఈ ముఠాను పట్టుకునేందుకు కృషి చేసిన ఏసీపీ వెంకటేశ్వర్, సౌత్ రూరల్ సీఐ జగడం నరేశ్, ఎస్సై లింబాద్రి, సీసీఎస్ టీమ్ సభ్యులను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.