ఇందూరు, ఆగస్టు 1 : ఆర్టీసీ ఆదాయాన్ని దెబ్బతీస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రగతిభవన్‌లో వివిధ శాఖల ప్రగతిపై అధికారులతో సోమవారం సాయంత్రం సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఎలాంటి పర్మిట్లు లేకుండా ప్రయాణికులతో రాకపోకలు సాగించే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని స్పష్టం చేశారు. రీజియన్ పరిధిలో ఆర్టీసీ ఆదాయంపై ఆర్ఎం ఉమాదేవి వివరించారు. ప్రైవేట్ వాహనాల కారణంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పర్మిట్లు లేకుండా తిరిగే వాహనాలను కట్టడి చేసేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని రవాణా, పోలీసు శాఖల అధికారులను ఆదేశించారు.
శాఖల వారీగా కేటాయించిన హరితహారం లక్ష్యాన్ని పూర్తిచేయాలన్నారు. పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, రైతువేదికలు, విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద హరితహారం అమలు తీరుపై నివేదికను అందజేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అర్హులైన విద్యార్థులకు కొవిడ్ వ్యాక్సిన్ వేసేలా విద్యా శాఖ అధికారులు చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎఫ్‌వో సునీల్, డీసీపీ అరవింద్‌బాబు పాల్గొన్నారు.
ఇందూరు, ఆగస్టు 1 : జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో ఉన్న ప్రగతిభవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 61 ఫిర్యాదులు అందాయని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సైట్లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశా, జడ్పీసీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.