ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న వీఆర్వోలకు ప్రభుత్వం విధులు అప్పగించింది. ఇన్నాళ్లు రెవెన్యూ శాఖలో పని చేసిన వారిని వేర్వేరు శాఖల్లో సర్దుబాటు చేసింది. గ్రామ రెవెన్యూ అధికారుల సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అనుసరించి ఉమ్మడి జిల్లాలో లక్కీ డ్రా నిర్వహించి ఈ ప్రక్రియను పూర్తి చేశారు.
వీఆర్వోలు తమకు కేటాయించిన శాఖల్లో నేటి (మంగళవారం) నుంచే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెవెన్యూ శాఖలో అంతర్భాగమైన వీఆర్వోలపై గతంలో తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం 2020 నవంబర్‌లో వీఆర్వో వ్యవస్థనే రద్దు చేసింది. తమకు శాశ్వత విధులు అప్పగించాలన్న వీఆర్వోల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది.
ఉమ్మడి జిల్లాలో మొత్తం 440 మంది వీఆర్వోలు ఉండగా, వారందరికీ విధులు కేటాయించింది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా, పకడ్బందీగా సర్దుబాటు ప్రక్రియను రెండు జిల్లాల కలెక్టర్లు పూర్తి చేశారు. సుమారు 22 నెలల నుంచి ఖాళీగా ఉంటున్న తమకు విధులు కేటాయించడంతో వీఆర్వోలు సంబురపడుతున్నారు.
నిజామాబాద్, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామ రెవెన్యూ అధికారి అనే పాత్ర ఇక ముగిసింది. రెవెన్యూ శాఖలో భాగమై కొనసాగిన వీఆర్వో పోస్టును 2020, నవంబర్లోనే రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. అనంతర కాలం నుంచి వీఆర్వోలు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం అప్పగించిన పనులు నిర్వహిస్తూ కొనసాగుతున్నారు. వీఆర్వో పోస్టు రద్దు చేసిన తర్వాత వీరికి శాశ్వతంగా విధులు అప్పగించకపోవడంతో కాసింత సందిగ్ధత నెలకొనగా రాష్ట్ర ప్రభు త్వం ఇప్పుడు పరిష్కారం చూపింది. జూలై, 2022లో జారీ చేసిన జీవో నెంబర్ 121 ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారులుగా పనిచేసిన వారందరినీ ఇకపై ఆయా ప్రభుత్వ శాఖల్లో వివిధ పోస్టుల్లో సర్దుబాటు చేశారు.
ఈ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ ప్రక్రియను చేపట్టారు. అనేక శాఖల్లో ఖాళీలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ ఆయా చోట్ల పోస్టింగ్‌లు ఇచ్చింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 445 మంది వీఆర్వోలకు ప్రభుత్వం ఖాళీలను చూపించింది. సర్దుబాటు ఉత్తర్వులపై వీఆర్వోలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు భూ యాజమాన్య హక్కుల బదలాయింపు పెద్ద సమస్యగా ఉండేది. ఈ క్రమంలో ఒకరి పేరిట పట్టా ఉండగా, కాస్తులో మరొకరు ఉండడంతో తగదాలు నెలకొన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న వివాదమే అదునుగా పలువురు రెవెన్యూ అధికారులు తమ జేబులు నింపుకొని అక్రమాలకు పాల్పడడంతో ఆ వివా దం మరింత పెద్దదైన సందర్భాలున్నాయి.
అసైన్మెంట్ భూములు, సర్వేలో సమస్యలు ఇలా భూ వివాదాలు కోకొల్లలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లక్షలాది మంది రైతులు రెవెన్యూ అధికారులకు బాధితులుగా మారినవారే. ఏదో ఒక సందర్భంలో పాస్‌బుక్కుల్లో పేర్ల మార్పిడి, భూ వివరాల నమోదు, సర్వే నెంబర్లను సరిచేయడం వంటి పనులతో వీఆర్వో, తహసీల్దార్ల చేతుల్లో బలి అయినవారే ఉన్నారు. చివరకు రెవెన్యూ చిక్కులు ఎంతకు తీసుకెళ్లాయంటే ఒకరినొకరు హత్యలు, దాడు లు, ఆత్మహత్యలు వరకు వెళ్లిన దాఖలాలు అనేకం.
ఉ మ్మడి కుటుంబాల్లో భూముల పంపకాల్లో రెవెన్యూ ఉ ద్యోగులు పెట్టిన చిచ్చు తీరని నష్టాలను సైతం మిగిల్చిం ది. ఇందుకు వందలాది ఘటనలు ఉదాహరణలుగా నిలిచాయి. వీటన్నింటికీ విరుగుడుగా రాష్ట్ర ప్రభుత్వం ఏకం గా వీఆర్వో పోస్టునే రద్దు చేస్తూ 2020, నవంబర్ 9న చట్టం తీసుకువచ్చింది. దీంతో రెవెన్యూ శాఖలో గ్రామ రెవెన్యూ అధికారుల పాత్ర శూన్యమైంది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ 2022 జూలై 27న జీవో నెంబర్ 121ను జారీ చేశారు. ఇందు లో వీఆర్వోలను ఏ విధంగా సర్దుబాటు చేయాలన్న వాటి పై మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు. మొత్తం 37 శాఖల్లో వీఆర్వోలను సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలను గుర్తించింది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం 245 మంది విధులు నిర్వహిస్తుండగా 245 ఖాళీలను గుర్తించారు.
కామారెడ్డి జిల్లాలో 195 మంది గ్రామ రెవెన్యూ అధికారులుండగా వీరి కోసం 200 పో స్టులు ఖాళీలు చూపించారు. ఆయా ఖాళీలను లాటరీ పద్ధతిలో అత్యంత పారదర్శకతను పాటిస్తూ భర్తీ చేశారు. వాస్తవానికి వీఆర్వో వ్యవస్థను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేసింది. ఉన్నతాధికారుల సూచనల మేరకు లాటరీ విధానం ఉత్తమం అని భావించి ముందడుగు వేశారు.
ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ శాఖల్లోని వివరాల ప్రకారం లాట రీ విధానం చేపట్టారు. జీవోలో పేర్కొన్న విధానం మేరకు ఒక వైపు వీఆర్వో పేరు, ఎంప్లాయి ఐడీతో కూడిన చీటిని రూపొందించారు. మరోవైపు కేటాయించాల్సిన ప్రభుత్వ శాఖ పేరు, అందులో పని చేయాల్సిన పోస్టు పేరుతో కూడిన చీటితో జత చేసి సర్దుబాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అడుగులోనూ పారదర్శకతకు పెద్దపీటను వేస్తున్న ది. రేషన్ బియ్యం పంపిణీ నుంచి దళిత బంధు యూని ట్ల మంజూరు ఇలా ఏది పరిశీలించినా కచ్చితత్వంతో కూడుకొని ఉంటుంది. వీఆర్వోల సర్దుబాటులో రాజకీయ ఒత్తిళ్లకు ఎలాంటి ఆస్కారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
ఇందులో భాగంగా వందలాది మంది వీఆర్వోలకు భరోసాను అందించేలా, వారిలో న మ్మకం కలిగించే విధంగా సర్కారు చర్యలు చేపట్టడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సర్దుబాటు నిర్ణయంపై గ్రామ రెవెన్యూ అధికారులుగా పని చేసిన వారంతా హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఇందూరు, ఆగస్టు 1 : నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ సోమవారం పూర్తయ్యింది. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, వీఆర్వోల సమక్షంలో లాటరీ పద్ధతిలో కేటాయింపులు చేపట్టారు. జిల్లాలో మొత్తం 245 మంది వీఆర్వోలను 37 శాఖల్లో సర్దుబాటు చేశారు.
వ్యవసాయ శాఖలో 10 మంది, పశు సంవర్ధక, డెయిరీ, ఫిషరీస్‌లో ముగ్గురు, వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖలో ఒకరు, అటవీశాఖలో ఒకరు, సమాచార శాఖలో ముగ్గురు, వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 45, ఉన్నత విద్యాశాఖలో 27, హోంశాఖలో 7, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్‌లో 3, ఇరిగేషన్లో 9, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్‌లో 11, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో 35, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలో 61, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 14, సెకండరీ ఎడ్యుకేషన్‌లో 3, ట్రాన్స్పోర్ట్ ఆర్‌అండ్‌బీలో 2, ట్రైబల్ వెల్ఫేర్‌లో 1, మహిళా శిశు సంక్షేమశాఖలో 4, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్లో ఐదుగురిని డ్రా ద్వారా సర్దుబాటు చేశారు.
సర్దుబాటు ప్రక్రియను వీడియో రికార్డింగ్ మధ్య జరిపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరిస్తూ వీఆర్వోలను ఇతర శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ లేదా దానికి సమానమైన హోదాలో బదలాయింపు చేశామన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమన్ తదితరులు పాల్గొన్నారు.