డిచ్పల్లి/ఇందల్వాయి/మెండోరా/కోటగిరి, జూలై 27: డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే బాలుర వసతి గృహంతోపాటు ఇందల్వాయి పీహెచ్‌సీని డీఎంహెచ్‌వో సుదర్శనం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్యోతిబాపూలే వసతిగృహంలోని వంటశాలను పరిశీలించి కూరగాయలు కుళ్లిపోకుండా చూడాలని, భోజనశాల, వంటపాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ.. జ్వరం, జలుబు లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు స్వయంగా వైద్య పరీక్షలు చేశారు.
ఆయన వెంట వైద్యాధికారి అరవింద్, మాతా శిశు సంరక్షణ శాఖ జిల్లా కో-ఆర్డినేటర్ గోవర్ధన్, హెచ్‌ఈవో శంకర్, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందల్వాయి పీహెచ్సీలో సిబ్బంది హాజరు, ఓపీ, రికార్డులను డీఎంహెచ్‌వో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్నందున వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ఆయన వెంట డాక్టర్ అరవింద్, హెచ్‌ఈవో శంకర్, సిబ్బంది ఉన్నారు.
మెండోరా మండలంలోని పోచంపాడ్‌లోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను ఎంపీపీ సుకన్య, తహసీల్దార్ సతీశ్‌రెడ్డి, ఎంపీడీవో సంతోష్‌కుమార్ సందర్శించి విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కల్పించారు. హెచ్ఎం చంద్రశేఖర్, గ్రామ సెక్రటరీ ప్రియాంక, భూమారెడ్డి, రాజు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఎంఈవో నాగ్నాథ్ తనిఖీ చేశారు. వంటపాత్రలు, కూరగాయలు, బియ్యం, పప్పులను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్యార్థులకు తాజా కూరగాయలతోనే భోజనం అందించాలని ప్రత్యేకాధికారిణి రూపకు సూచించారు.
కోటగిరి కేజీబీవీ విద్యార్థినులకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కరోనా టీకాలు వేశారు. 85 మంది విద్యార్థినులతోపాటు మండలంలో బుధవారం మొత్తం 596 మందికి వ్యాక్సిన్ చేశామని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ అద్నాన్ చెప్పారు.